అల్లిపూర్ నూతన మున్నూరు కాపు పాలకవర్గానికి ఘన సన్మానం
రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతామని దావ వసంత సురేష్ వెల్లడి
రాయికల్ | Ntoday News
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన నూతన మున్నూరు కాపు సంఘం పాలకవర్గ సభ్యులు జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ ప్రతినిధులను దావ వసంత సురేష్ పొన్నాడలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అల్లిపూర్ రాయికల్ మండలంలోని గ్రామంగా అధికారిక రికార్డుల్లోనూ ఉంది.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ మున్నూరు కాపు కుల బాంధవులు ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే సంఘం మరింత బలోపేతమవుతుందని అన్నారు. మట్టిలో చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే భూమిపుత్రులుగా మున్నూరు కాపులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున మున్నూరు కాపు భవన నిర్మాణానికి ఐదెకరాల భూమి కేటాయించడంతో పాటు వివిధ కులవృత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించారని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దావ వసంత సురేష్ విమర్శించారు. గతంలో లభించిన 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సౌకర్యాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. ఎరువుల కోసం యాప్‌ల ద్వారా బుకింగ్ చేసే విధానాన్ని తొలగించి రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
అల్లిపూర్ గ్రామానికి చెందిన సుమారు 700 మంది రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై కూడా ఆమె స్పందించారు. రైతులకు పూర్తి హక్కులు లభించే వరకు వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అత్తినేని గంగారెడ్డి, రాజన్న, నర్సన్న, వనిత, గంగాధర్, బక్కన్న, నర్సయ్య, దోమకొండ బక్కన్న, గణేష్, కట్ట ఆశలు, ఏంబారీ రాజేందర్, శ్రీకాంత్, గంగన్న, కొల్లూరి గంగన్న, పడాల సత్యం, అత్తినేని సాయిరెడ్డి, అంబారీ కమలాకర్, మండ రవి, అత్తినేని భూమన్న, కర్ణవలె రాజేశం తదితర కుల పెద్దలు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.