ఉచిత పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి:
ప్రభుత్వం అందిస్తున్న టీబీ (క్షయ) ఉచిత వైద్య పరీక్షలు, సేవా సౌకర్యాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి కోరారు. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని 9వ వార్డు ఇందిరమ్మ కాలనీ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన ఉచిత టీబీ పరీక్షల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా బస్తీ దవాఖానల్లోనే ఉచితంగా టీబీ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. టీబీ తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ, సకాలంలో గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి ఆమె సూచించారు. లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వివేక్, స్టాఫ్ నర్స్ రాణిలతో పాటు బస్తీ దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.