దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఖండించాలి
తెలంగాణ
/
జగిత్యాల
బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై ధర్మపురిలో కాంగ్రెస్ నిరసన
ధర్మపురి | Ntoday News
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఐదుగురు దళిత నాయకులకు మంత్రి పదవులు కల్పించి, దళితుల పట్ల తమ పార్టీ నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు.
గతంలో దళిత నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించిన సందర్భంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారంటూ చేసిన వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను సహించేది లేదని వేముల నాగలక్ష్మి హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిపిరిశెట్టి రాజేష్, నాయకులు కుంట సుధాకర్, కౌన్సిలర్లు సంగి ఆనంద్, ముడుసుల ప్రశాంత్, వొజ్జల లక్ష్మణ్, విరవేణి నాగలక్ష్మి, చుక్క సంధ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.