అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి పలు నిర్ణయాలు.. ప్రకటనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన అనంతరం పలు అంశాలపై నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
12వ వేతన సవరణ సంఘం నియామకానికి అంగీకారం.
రెండు డీఏలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లింపు.
2024 జూలై 1, 2025 జనవరి 1 నుంచి రావాల్సిన డీఏల విడుదలకు నిర్ణయం.
2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ నగదును వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి అంగీకారం.
పోలీసులకు అదనంగా ఒక సరెండర్ లీవ్ నగదును ఈ దసరాకు చెల్లించనున్నారు.
అదనపు పెన్షన్ పరిమాణాన్ని 2027 జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం.
70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ వర్తింపు.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం. వచ్చే నెల నుంచే ప్రతి నెలకు సంబంధించిన చెల్లింపును అదే నెలలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు చెల్లించేందుకు అంగీకారం.
ఈ నిర్ణయాల అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.