BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అయోధ్య రామాలయ విరాళాల స్వాహా కేసులో కొత్త కోణాలు.. సిట్‌ విచారణకు మరో 15 రోజుల పొడిగింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:38 PM
28 వీక్షణలు


అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల విరాళాల స్వాహా కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విరాళాల దుర్వినియోగం మాత్రమే కాకుండా, ఆలయంలో ఉద్యోగ నియామకాల పేరుతో భారీ కమీషన్లు వసూలు చేసిన వ్యవహారం కూడా బయటపడింది. ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జూలై 15 వరకు గడువు పొడిగించింది.

సిట్‌ విచారణలో మాజీ ట్రస్టీ అనిల్‌ మిశ్రా పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆలయంలో సుమారు 125 మంది ఉద్యోగులను ఆయన సిఫారసుతో నియమించారని, వారిలో కొందరి నుంచి కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నియమితులైన వారిలో ఆయన బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ట్రస్టీగా ఉన్న సమయంలో అనిల్‌ మిశ్రా సంపాదించిన ఆస్తులపై సిట్‌ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌ కుశ్‌ మిశ్రాలు పెద్దగా ఆదాయ వనరులు లేకపోయినా భారీ భవంతులు నిర్మించుకున్నట్లు గుర్తించారు. వీరిద్దరూ అనిల్‌ మిశ్రాకు బంధువులే కావడం గమనార్హం. విరాళాల సొమ్ముతోనే వీరు ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్‌ ప్రాథమికంగా నిర్ధారించింది. వీరికి సంబంధించిన ఆరు ఆస్తులను ఇప్పటికే గుర్తించింది.

గత ఏడాది జరిగిన కుంభమేళా సమయంలోనే అత్యధికంగా విరాళాల స్వాహా జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో అయోధ్య రామాలయానికి భారీ ఎత్తున నగదు విరాళాలు, ముడుపులు రావడంతో నిందితులు అదే అవకాశంగా తీసుకుని కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు అవినాష్‌ శుక్లా, అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌ కుశ్‌ మిశ్రా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌, కరుణేష్‌ పాండే, రామశంకర్‌ మిశ్రా, సుభాష్‌ శ్రీవాస్తవ, రామ్‌శంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్ను యాదవ్‌ సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మంగళవారం సిట్‌ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు.

అరెస్టయిన వారిలో అవినాష్‌ శుక్లా వద్దే అత్యధిక నగదు స్వాధీనం చేసుకున్నారు. అతని సోదరుడు అభిషేక్‌కు చెందిన యోగా సెంటర్‌లో నాలుగు పెట్టెల్లో భారీ మొత్తాన్ని దాచిపెట్టినట్లు గుర్తించారు. మరో నిందితుడు టిన్ను యాదవ్‌ ఇంటి నుంచి కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు.

అయోధ్య రామాలయంలో నగదు విరాళాలను లెక్కించే బాధ్యతను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి అప్పగించారు. ఎస్‌బీఐ ఇందుకోసం ఒక ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించింది. నగదు లెక్కింపులో మొత్తం 14 మంది సిబ్బంది పాల్గొంటుండగా, వారిలో 11 మంది బ్యాంకు సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్ట్‌కు చెందిన వారు ఉన్నారు. నగదు లెక్కించే గది తాళాల్లో ఒకటి టిన్ను యాదవ్‌ వద్ద, మరొకటి బ్యాంకు సిబ్బంది వద్ద ఉన్నట్లు సిట్‌ గుర్తించింది.

నిందితుల బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు, ఆర్థిక లావాదేవీలపై సిట్‌ విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. వారి ఖాతాల్లో జరిగిన లావాదేవీలు అధికారిక ఆదాయానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ సహాయాన్ని కూడా సిట్‌ కోరింది. అలాగే స్వాహా చేసిన డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశంపై మరింత లోతైన విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి లేఖ రాయనున్నట్లు సమాచారం.

ఇక ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ఎస్‌బీఐకి సిబ్బందిని పంపిన సైనిక్‌ సెక్యూరిటీ ఏజెన్సీ స్పష్టం చేసింది. బ్యాంకు కోరిన మేరకు సిబ్బందిని పంపడం వరకే తమ బాధ్యత అని ఆ సంస్థ డైరెక్టర్‌ గౌరవ్‌ సింగ్‌ తెలిపారు. అరెస్టయిన ఎనిమిది మందిలో ఆరుగురు తమ సంస్థ పంపిన సిబ్బందేనని ఆయన వెల్లడించారు.

అయోధ్య రామాలయ విరాళాల స్వాహా కేసు ఇప్పుడు కేవలం నగదు అక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా, నియామకాల అవినీతి, ఆస్తుల సమీకరణ, బ్యాంకు సిబ్బంది పాత్ర, మనీలాండరింగ్‌ కోణాల దాకా విస్తరిస్తుండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.