Begumpet: గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ అండాల దందా..
- బేగంపేటలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ అండాల దందా..
- వ్యభిచారం ఆరోపణలతో కలకలం
హైదరాబాద్‌లోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఉన్న నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై బేగంపేట పోలీసులు, ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించాయి. ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో గత ఏడాది కాలంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 8 నుంచి 10 మంది యువతులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
యువతుల నుంచి అండాలను సేకరించి సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అండాల సేకరణ, విక్రయాలు, సరఫరా వెనుక ఎవరున్నారు...? ఏయే ఫెర్టిలిటీ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు...? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.
అండాలతో పాటు పురుషుల వీర్యకణాలను కూడా సేకరించి సరఫరా చేస్తున్నారా...? అనే అనుమానంతో విచారణ కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి.
యువతుల సమ్మతితోనే అండాలు సేకరించారా...? వైద్యపరమైన నిబంధనలు పాటించారా...? ఇతర రాష్ట్రాల నుంచి యువతులను ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారు...? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.