చింతలపూడి: గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 17 మందికి పైగా గాయాలు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి రహదారిపై నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో 17 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా యండపల్లి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో క్లీనర్ అందులో చిక్కుకుని మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న చింతలపూడి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్‌ఐ సతీష్ ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నారు.