జలంధర్‌లో సెప్టెంబర్ 20, 21న అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ మహాసభలు
ఏలూరు జిల్లా, చాట్రాయి: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో, షహీద్ భగత్ సింగ్ జన్మభూమిలో అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎం) జాతీయ మహాసభలు 2026 సెప్టెంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జాతీయ కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు. ఈ మేరకు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మర్రిబంధం గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జాతీయ మహాసభలను విజయవంతం చేయడానికి రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని పేర్కొంటూ, రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న నిబంధనలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఎల్‌నినో ప్రకటనలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారికి భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో వేలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రైతు సంఘాలతో కలిసి ఐక్య పోరాటం నిర్వహిస్తామని హరినాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని సుమారు 30 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదని విమర్శించిన ఆయన, యూరియా పంపిణీపై ఇటీవల తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేసి రైతులకు ఒకేసారి అవసరమైన ఎరువును అందించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2+50 శాతం గిట్టుబాటు ధర అమలు చేయాలని, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసే ప్రభుత్వాలు అప్పుల భారంతో ఉన్న రైతులకు కూడా రుణమాఫీ ప్రకటించాలని కోరారు.
60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ భూములను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అవసరమైతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
"వ్యవసాయాన్ని కాపాడుకుందాం... భూమిని కాపాడుకుందాం... రైతును కాపాడుకుందాం..." అంటూ రైతాంగం ఐక్యంగా పోరాడాలని హరినాథ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు సమస్యలపై గ్రామస్థులతో చర్చించి, జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.