BREAKING
మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం
www.ntodaynews.com

జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:36 PM
14 వీక్షణలు

ప్రస్తుత కాలంలో జర్నలిజం టెక్నాలజీ పరంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు పత్రికలు, టెలివిజన్ ఛానళ్లకే పరిమితమైన మీడియా ప్రపంచం ఇప్పుడు డిజిటల్ వేదికలపై విస్తరించింది. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు… ప్రతి ఒక్కరూ వార్తలను ప్రసారం చేసే స్థాయికి పరిస్థితులు మారాయి. ప్రస్తుతం డిజిటల్ మీడియానే ప్రధాన సమాచార వేదికగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మీడియా ఏ రూపంలో ఉన్నా, దాని అసలు బలం “విలువలు” మరియు “బాధ్యత” అనే విషయాన్ని మరవకూడదు.

జర్నలిజం అనేది కేవలం వార్తలు చెప్పే వృత్తి కాదు. అది సమాజాన్ని మేల్కొలిపే బాధ్యత. ప్రజల గొంతుకగా నిలబడే ధర్మం. అధికారాన్ని ప్రశ్నించే శక్తి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే వ్యవస్థ. కానీ ప్రస్తుతం ఆ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయనే ఆందోళన సీనియర్ జర్నలిస్టుల్లో పెరుగుతోంది.

డిజిటల్ మీడియా అభివృద్ధి మంచి అవకాశాలను తీసుకొచ్చింది. ప్రధాన మీడియా సంస్థల్లో నిరుత్సాహానికి గురైన అనేక మంది అనుభవజ్ఞులైన జర్నలిస్టులు తమ సొంత వేదికలను ఏర్పాటు చేసుకుని ప్రజల మధ్యకు వస్తున్నారు. ఇది స్వాగతించదగిన మార్పే. కానీ అదే సమయంలో జర్నలిజం అంటే ఏమిటో కూడా తెలియని కొందరు వ్యక్తులు మీడియా పేరిట రంగంలోకి దిగడం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తోంది.

కొంతమంది అక్రమ వ్యాపారాలు, అవినీతి కార్యకలాపాలకు మీడియా ముసుగును ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. విలువలతో పనిచేస్తున్న ఎందరో జర్నలిస్టులకు ఇది మౌనవేదన మాత్రమే కాదు, జర్నలిజం ప్రతిష్ఠను దెబ్బతీసే పరిస్థితిగా మారింది.

అనుభవం లేకుండానే, సమాజ బాధ్యత తెలియకుండానే కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికల పేరిట “స్టేట్ బ్యూరో”, “రీజనల్ కో-ఆర్డినేటర్”, “స్టాఫ్ రిపోర్టర్”, “సీఈఓ” వంటి హోదాలు పెట్టుకుని అధికారులను ప్రభావితం చేయడం, ఐడీ కార్డులు చూపించి అక్రమాలకు పాల్పడడం వంటి ఘటనలు జర్నలిజం గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఇది కేవలం మీడియా రంగానికే కాదు… సమాజానికే ప్రమాదకర సంకేతం. ఎందుకంటే ప్రజలు జర్నలిస్టులను నమ్మడం ఆపేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. నిజం చెప్పే వేదికలపై విశ్వాసం కోల్పోతే అబద్ధాలు, ప్రచారాలు, దోపిడీ వ్యవస్థలు బలపడతాయి.

ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే… జర్నలిజంలో ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు, మాస్టర్స్, డాక్టరేట్‌లు పొందినవారు కూడా సరైన గుర్తింపు లేక గ్రామీణ విలేకరులుగానే మిగిలిపోతుంటే, అనుభవం, అర్హతలు లేని వారు పెద్ద హోదాలు చెప్పుకుంటూ వ్యవస్థను అక్రమాల వైపు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది నిఖార్సయిన జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం మాత్రమే కాదు, జర్నలిజం విలువలను అణచివేసే చర్య కూడా.

జర్నలిజం ఒక పవిత్రమైన బాధ్యత. అది బజారు సరుకుగా మారకూడదు. వార్తలు అమ్మకానికి పెట్టే పరిస్థితి వస్తే ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోతుంది. ఒకప్పుడు సమాజ మార్పుకు దారితీసిన గొప్ప జర్నలిజం… ఇప్పుడు కొందరి స్వప్రయోజనాల కోసం వాడబడుతుందనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితి మారాలి.

డిజిటల్ మీడియా రంగంలో కూడా కచ్చితమైన ప్రమాణాలు అవసరం. మీడియా సంస్థను ప్రారంభించాలంటే కనీస అనుభవం, విద్యార్హతలు, జర్నలిజంపై అవగాహన ఉండేలా నిబంధనలు తీసుకురావాలనే అభిప్రాయం బలపడుతోంది. సమాజ బాధ్యత తెలిసిన వ్యక్తులకే మీడియా అనుమతులు ఇవ్వాలని చాలామంది సీనియర్ జర్నలిస్టులు సూచిస్తున్నారు. ఎందుకంటే జర్నలిజం అనేది అధికార పత్రం కాదు… అది ప్రజాసేవ.

జర్నలిస్టు అనే పేరు గౌరవం పొందాలంటే ముందు జర్నలిస్టు తన విలువలను కాపాడుకోవాలి. నిజాయితీ, నిష్పక్షపాతం, సామాజిక బాధ్యత, ప్రజల పట్ల నిబద్ధత… ఇవే జర్నలిజం ప్రాణాలు. వీటిని కోల్పోతే జర్నలిజం ఒక దోపిడీ వ్యవస్థగా మారిపోతుంది.

ఇప్పటికీ సమాజంలో జర్నలిజానికి గౌరవం ఉంది అంటే… అది విలువలతో పనిచేస్తున్న కొందరు నిజమైన జర్నలిస్టుల వల్లే. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం కలం పట్టే వారు ఇంకా ఉన్నారు. నిజం కోసం ఒత్తిళ్లను ఎదుర్కొనే వారు ఇంకా ఉన్నారు. అదే జర్నలిజానికి మిగిలిన ఆశ.

ఇకపై మీడియా ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి. సంచలనాల కోసం కాదు… సమాజ సంస్కరణ కోసం పనిచేయాలి. భయాన్ని కాదు… బాధ్యతను పెంచాలి. విభేదాలను కాదు… చైతన్యాన్ని పెంచాలి. జర్నలిజం ఒక ఉద్యోగం మాత్రమే కాదు… అది సమాజాన్ని మార్చే ఉద్యమం అనే భావనతో ముందుకు సాగాలి.

అందుకే జర్నలిజం విలువలను కాపాడటం ప్రతి నిజాయితీ గల జర్నలిస్టు బాధ్యత. ఎందుకంటే కలం బలహీనపడితే సమాజం చీకటిలోకి వెళ్తుంది. జర్నలిస్టు అనే హోదా మనకు ఉన్నప్పటికీ, హోదాతో బ్రతకడం జర్నలిజం కాదు. ఈ సమాజం పట్ల బాధ్యతతో విధి నిర్వహణ చేయడమే నిజమైన జర్నలిజం.

ఎపూరి రాజారత్నం

MA, MJMC (Ph.D)

రచయిత & జర్నలిస్టు

9390062078