కావేరిపాక్కంలో దారుణం.. కుమార్తెను పెళ్లి చేసుకుంటానన్న యువకుడిపై మరుగుతున్న నూనె పోసిన తల్లి
తమిళనాడులోని రాణిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని కోరిన యువకుడిపై ఓ మహిళ మరుగుతున్న నూనె పోసిన ఘటన కలకలం రేపింది.
కావేరిపాక్కం సమీపంలోని ఉత్తిరంపట్టు గ్రామానికి చెందిన దమీమ్ (36) భర్త మరణించడంతో కుమారుడు, 18 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది. మూడు నెలల క్రితం కావేరిపాక్కంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడికి మకాం మార్చింది.
ఈ క్రమంలో ఒచ్చేరి సమీపంలోని ఆయర్పాడికి చెందిన లోకేష్ (19), దమీమ్ కుమార్తె రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం లోకేష్ ఆమె ఇంటికి వెళ్లి.. తన ప్రియురాలిని వివాహం చేసుకునేందుకు అంగీకరించాలని దమీమ్‌ను కోరాడు.
అయితే కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరడంతో దమీమ్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. వెంటనే వంటగదిలోకి వెళ్లి మరుగుతున్న నూనె తీసుకొచ్చి లోకేష్‌పై పోసింది. దీంతో తీవ్రంగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అతడిని వాలాజాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై బాధితుడు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.