స్నేహితురాలి ఇంట్లో బంగారం చోరీ.. ప్రియుడికి బైక్ గిఫ్ట్!
ట్రిప్లికేన్: ప్రియుడికి ద్విచక్ర వాహనం కొనివ్వాలనే ఉద్దేశంతో స్నేహితురాలి ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిన కళాశాల విద్యార్థిని పోలీసులకు చిక్కింది. ఈ ఘటన తమిళనాడులోని పొళ్లాచ్చిలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. కోయంబత్తూర్ జిల్లా పొళ్లాచ్చికి చెందిన 19 ఏళ్ల యువతి స్థానిక ప్రభుత్వ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గత ఆగస్టు 16న స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె.. ఇంట్లోని బీరువాలో ఉన్న తొమ్మిది సవర్ల బంగారు నగలను చోరీ చేసింది. విషయం గుర్తించిన స్నేహితురాలి తండ్రి తమిళ్‌సెల్వన్ పొళ్లాచ్చి నార్త్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చోరీకి గురైన నగలను యువతి పొళ్లాచ్చిలోని ఓ దుకాణంలో రూ.2.50 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. ఆ డబ్బుతో మక్కినాంపట్టికి చెందిన తన ప్రియుడికి ద్విచక్ర వాహనం కొనిచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో పోలీసులు యువతిపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి కోయంబత్తూర్ మహిళా జైలుకు తరలించారు.