రాజుపేటలో ముత్యాలమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ప్రజలతో మమేకమై.. స్వయంగా భోజనాలు వడ్డించిన కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు, సెప్టెంబర్ 6: ప్రజల విశ్వాసమే తనకు బలమని, ప్రజలతో మమేకమై వారి సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉండటమే తన లక్ష్యమని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తిరువూరు రాజుపేటలో ఆదివారం నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి కొలుపులు, పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంపలగూడెం మండలం కనుమూరు గ్రామంలో ముక్కాలా శశిరెడ్డి నివాసంలో నిర్వహించిన ఉప్పలమ్మ తల్లి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు, భక్తులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మమేకమయ్యారు. స్వయంగా భోజనాలు వడ్డించి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. పదవిలో ఉన్నప్పటికీ ప్రజల్లో ఒకరిగా కలిసిపోతూ, వారి సంతోషాల్లో భాగస్వామిగా నిలవడం తన బాధ్యతగా భావించే ఎమ్మెల్యే తీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
అమ్మవారి కృపాకటాక్షాలతో తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.