కామవరపుకోటలో రైతన్నలకు మెరుగైన సేవలే లక్ష్యం ఎత్తిపోతల పథకం చైర్మన్‌గా అంజి మూర్తి ఏకగ్రీవ ఎన్నిక
ఏలూరు జిల్లా కామవరపుకోట, సెప్టెంబర్ 6:
శ్రీ గంటా హనుమంతరావు ఎర్ర కాలువ ఎత్తిపోతల పథకం ద్వారా రైతన్నలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నూతన చైర్మన్ కంఠమనేని అంజి మూర్తికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సూచించారు.
ఎత్తిపోతల పథకం చైర్మన్‌గా గతంలో బాధ్యతలు నిర్వహించిన కంఠమనేని సత్యనారాయణ (మీసాల బాబాయ్) ఇటీవల మృతి చెందారు. ఆయన స్థానంలో సంఘ ఉపాధ్యక్షుడు మానుకొండ దేవసుతుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో సంఘ పరిధిలోని కంఠమనేని వారి గూడెం గ్రామానికి చెందిన కంఠమనేని అంజి మూర్తిని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అంజి మూర్తి అనంతరం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి అందుబాటులో ఉంటూ ఎత్తిపోతల పథకం ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
మీసాల బాబాయ్ సేవలను కొనసాగించాలి
గతంలో చైర్మన్‌గా పనిచేసిన మీసాల బాబాయ్ పేరును నిలబెట్టేలా అంజి మూర్తి పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
నూతన చైర్మన్ అంజి మూర్తిని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు ఘంటా మాధవరావు, రేగుంట సురేష్, గోరింక దాసు, బేతిన వెంకట్రావు, ఘంటా సత్యంబాబు, కొండూరి రాజా, ఎత్తిపోతల పథకం డైరెక్టర్లు, కూటమి నాయకులు అభినందించారు.