మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి మరో 10 మందికి పైగా అస్వస్థత.. ఆరు మద్యం దుకాణాలు మూసివేత
మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సాగర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ‘బాంబే విస్కీ’ పేరుతో విక్రయించిన మద్యం సేవించిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది మృతి చెందగా, మరో 10 మందికి పైగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
బాధితుల్లో మిథైల్ ఆల్కహాల్ విష ప్రభావానికి సంబంధించిన లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కల్తీ మద్యం కారణంగానే ఈ మరణాలు సంభవించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. పూర్తి స్థాయి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు అధికారులు ఆరు మద్యం దుకాణాలను సీజ్ చేసి, మద్యం నమూనాలను పరీక్షలకు పంపినట్లు సమాచారం.
కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.