డ్యూటీలో రీల్స్ చేస్తే ఉద్యోగానికే ఎసరు?.. కేంద్రం కీలక ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాను వినియోగించే విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ప్రత్యేక ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపాదిత నిబంధనల్లో భాగంగా కార్యాలయాల్లో లేదా అధికారిక యూనిఫామ్‌లో వ్యక్తిగత రీల్స్, వీడియోలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న హోదాను ఉపయోగించుకుని సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం, పాపులారిటీ పొందడం వంటి అంశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అదేవిధంగా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం, వివాదాస్పద రాజకీయ అంశాలపై పోస్టులు పెట్టడం, సోషల్ మీడియా వేదికల ద్వారా ఉద్యోగ హోదాను ఉపయోగించుకుని వాణిజ్య ప్రయోజనాలు పొందడం వంటి అంశాలపైనా నిబంధనలు తీసుకురావచ్చని తెలుస్తోంది.
అయితే ఈ నిబంధనలు ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్నట్లు సమాచారం. తుది మార్గదర్శకాలు ఖరారైన తర్వాతే ఉద్యోగులపై వర్తించే నిబంధనలు, ఉల్లంఘనలకు విధించే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నిబంధనలు అమల్లోకి వస్తే ఉల్లంఘనలకు శాఖాపరమైన చర్యలు, ఇంక్రిమెంట్ల నిలుపుదల లేదా కోత, సస్పెన్షన్ వంటి క్రమశిక్షణ చర్యలకు అవకాశం ఉండవచ్చని సమాచారం.