మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా
ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం (06-06-2026) మధ్యాహ్నం సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీలో ఉన్న “దంజాల దక్షిణామూర్తి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా పాఠశాల వంటశాల, పరిసరాల పరిశుభ్రత, క్రీడా సామాగ్రి మరియు ఆట వస్తువులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులు, బియ్యం నిల్వలు, రోజువారీ మెనూ బోర్డును నిశితంగా పరిశీలించి, నిర్వహణ సక్రమంగా ఉండాలని అధికారులకు సూచించారు.
తదుపరి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన ఎమ్మెల్యే స్వయంగా ఆహారాన్ని రుచి చూశారు. వంటలో రుచి, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వంట నిర్వాహకులకు ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ “ప్రతిరోజూ భోజనం బాగుంటుందా? మెనూ ప్రకారం కడుపునిండా భోజనం పెడుతున్నారా?” అని ప్రశ్నించారు. విద్యార్థులు భోజనం సంతృప్తికరంగా ఉంటుందని తెలిపారు. వారానికి ఐదు సార్లు గుడ్లు అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్న బ్యాగులు, షూస్ తదితర సామాగ్రిపై కూడా ఎమ్మెల్యే విచారణ జరిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న వస్తువులు మెరుగైన నాణ్యతతో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన, పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. భోజనశాల, పాఠశాల మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలవాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందన్నారు.
ప్రభుత్వం రూపొందించిన మెనూ క్యాలెండర్ ప్రకారం ప్రతిరోజూ గుడ్లు, పప్పు, చారు వంటి పౌష్టికాహారం అందించాలని, ఆహారంలో నాణ్యత, పరిమాణం, వైవిధ్యం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
ఇకపై కూడా సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. పాఠశాల ఇన్‌చార్జ్‌లు, హెడ్‌మాస్టర్లు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, బీఈఓ, ఎంఈఓ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ కంచి ధనశేఖర్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, అధ్యక్షులు బేవర సూర్య, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.