మహాలక్ష్మితో ఉపాధికి గండి.. రాపిడోతో పొట్టమీద దెబ్బ.. ఆటో కార్మికుల కన్నెర్ర
- ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయవంతమైన రౌండ్ టేబుల్ సమావేశం
- రూ.1,000 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ప్రభుత్వానికి 7 డిమాండ్లు
- సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా బంద్ తప్పదని హెచ్చరిక
మంచిర్యాల :ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం అన్ని ఆటో యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటం చేయాలని తీర్మానించాయి. గురువారం మంచిర్యాల పట్టణంలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హెచ్‌ఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా జరిగింది.
ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఏ (RWA), బీఆర్‌టీయూ (BRTU), బీఎంఎస్ (BMS), 246 మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్, జేఏసీ ఆటో యూనియన్ తదితర సంఘాల జిల్లా నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' పథకం అమలు అనంతరం ఆటోలకు గిరాకీ తీవ్రంగా తగ్గిపోయి వేలాది మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, 'రాపిడో' కార్యకలాపాల కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. రాపిడోను అరికట్టేందుకు ఐక్యంగా పోరాటం చేస్తామని, అవసరమైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించి రాపిడో కార్యకలాపాలను అడ్డుకుంటామని తీర్మానించారు.
ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు:
*రూ. 1,000 కోట్ల నిధులతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
*ఆటో సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి.
*ఆటో డ్రైవర్లకు జీవన భృతి కింద రోజుకు రూ. 500 చొప్పున, నెలకు రూ. 15,000 అందించాలి.
*50 సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 6,000 పెన్షన్ ఇవ్వాలి.
*మహాలక్ష్మి పథకం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.
*ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి.
*ఆటోలకు సంబంధించిన ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, ఇతర ప్రభుత్వ రుసుములను పూర్తిగా ప్రభుత్వమే భరించాలి.
ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో అన్ని ఆటో యూనియన్లను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షఫీ, ప్రధాన కార్యదర్శి తగరం శ్రీనివాస్, జెఎసి జిల్లా అధ్యక్షులు కట్ట రామ్ కుమార్, ఏ ఆర్ డబ్ల్యూ ఏ ఆటో యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సుద్దాల రాజు, బి ఎం ఎస్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు చల్ల విక్రం, 246 ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొట్ట మధు, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు అభి పాషా మరియు ఇతర నాయకులు కలువల అంజయ్య, జూదం రాజు, దిలీప్ గౌడ్, పులి రాజేందర్ గౌడ్, ఆవుల సుధాకర్, రాగిడి రాజు, మాలం జగదీష్, నున్సావత్ చిరంజీవి, పిల్లి ఆనంద్, గోల్డ్ మాన్ శీను, ముద్దం రాజేశ్వర్ రెడ్డి, ఎండి హుస్సేన్, పల్లపు శ్రీనివాస్, ఎండి అజీముద్దీన్, రాజు గారి మహేష్, అనంతుల మహేష్ తదితరులు పాల్గొన్నారు