మొసలి మింగిన బాలుడు మూడేళ్ల తర్వాత క్షేమంగా తిరిగొచ్చిన అద్భుత గాథ..
మొసలి మింగిన బాలుడు మూడేళ్ల తర్వాత క్షేమంగా తిరిగొచ్చిన అద్భుత గాథ.. అవినాశి ఆలయంలో నేటికీ సజీవంగా ఉన్న చరిత్ర
తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని ప్రాచీన అవినాశిలింగేశ్వర ఆలయం భక్తి, చరిత్ర, అద్భుతాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అవినాశి అప్పర్ ఆలయంగా కూడా పిలిచే ఈ క్షేత్రంలో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఓ శిల్పం శైవ భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది 63 మంది శైవ నాయనార్లలో ప్రముఖుడైన సుందరమూర్తి నాయనార్ జీవితంలో చోటుచేసుకున్న అద్భుత సంఘటనకు ప్రతిరూపం.
శివభక్తుల్లో అగ్రగణ్యుడైన సుందరమూర్తి నాయనార్ తేవారం అనే పవిత్ర తమిళ శైవ కీర్తనల సంకలనంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆయన జీవితంలో జరిగిన ఈ అద్భుత ఘటనను తమిళంలో “ముదలై వాయి పిళ్ళై” అని పిలుస్తారు. దీని అర్థం “మొసలి నోటిలోని బాలుడు”.
ఎనిమిదో శతాబ్దంలో సుందరమూర్తి నాయనార్ అవినాశి గ్రామం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒకే వీధిలో ఉన్న రెండు ఇళ్లలో భిన్నమైన పరిస్థితులను గమనించారు. ఒక ఇంట్లో ఆనందోత్సాహాలతో బాలుడి ఉపనయన వేడుక జరుగుతుండగా, ఎదురింట్లో మాత్రం తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నారు.
దీనికి కారణం తెలుసుకున్న సుందరార్‌కు ఓ విషాద కథ తెలిసింది. మూడేళ్ల క్రితం ఆ రెండు ఇళ్లకు చెందిన బాలురు సమీపంలోని తామరై కుళం అనే చెరువులో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ పెద్ద మొసలి ఒక బాలుడిని మింగేసింది. బతికి ఉన్న బాలుడికి ఉపనయన వేడుక జరుగుతుండటం చూసి, తమ కుమారుడు కూడా ఉంటే ఇదే విధంగా వేడుక చేసుకునేవారమని ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.
వారి ఆవేదన చూసి సుందరమూర్తి నాయనార్ హృదయం కరిగిపోయింది. వెంటనే చెరువు వద్దకు వెళ్లి అవినాశిలింగేశ్వరుడైన పరమశివుడిని భక్తితో ప్రార్థిస్తూ “ఎట్రానై మరక్కేనే” అనే ప్రసిద్ధ దేవార పదిగాన్ని ఆలపించారు.
సుందరార్ భక్తికి మెచ్చిన పరమశివుడు అద్భుతాన్ని ప్రదర్శించాడని శైవ సంప్రదాయం చెబుతుంది. ప్రార్థన పూర్తికాగానే ఎండిపోయిన చెరువులోకి నీరు ప్రవహించి నిండిపోయింది. అనంతరం ఓ భారీ మొసలి నీటిలో నుంచి పైకి వచ్చింది. ఆ మొసలి నోటిలో నుంచి బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు.
మూడేళ్ల క్రితం అదృశ్యమైన బాలుడు కాలం గడిచినా ఎనిమిదేళ్ల వయసులోనే, ఉపనయనానికి సిద్ధమైన వయసులో తిరిగి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివానుగ్రహంతో బాలుడికి పునర్జన్మ లభించిందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ అద్భుత ఘట్టాన్ని ఆలయ శిల్పులు ఎంతో నైపుణ్యంతో రాతిపై చెక్కారు. మొసలి నోటి నుంచి బాలుడు బయటకు వస్తున్న దృశ్యం భక్తి, దైవ కరుణ, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.
ఈ కథ తమిళ శైవ సాహిత్యంలో ప్రముఖమైన “పెరియపురాణం” గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. నాయనార్ల జీవిత చరిత్రలను వివరించే ఈ గ్రంథంలో సుందరార్ భక్తి మహిమకు ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
ప్రతి సంవత్సరం పంగుణి మాసంలో అశ్విని నక్షత్రం రోజున అవినాశిలింగేశ్వర ఆలయంలో “ముదలై వాయి పిళ్ళై” అద్భుతాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని సుందరమూర్తి నాయనార్ భక్తి మహిమను స్మరించుకుంటారు.