మిషన్ మార్చి కార్యక్రమం పరిశీలించిన ఎంఈఓ1 మాసగిరి
చిత్తపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిషన్ మార్చి కార్యక్రమం పరిశీలించిన ఎంఈఓ1 మాసగిరి
ఏలూరు జిల్లా / నూజివీడు నియోజకవర్గం / చాట్రాయి మండలం: చిత్తపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రవేశపెట్టిన మిషన్ మార్చి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రధానోపాధ్యాయురాలు సౌభాగ్యం ను అడిగి తెలుసుకున్నారు.
మిషన్ మార్చిలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు గణితంలో నిర్వహిస్తున్న స్లిప్ పరీక్షను ఎంఈఓ1 శ్రీనివాస్ పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు క్రమం తప్పకుండా సాధన చేయాలని, సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు చేశారు.
అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
పదో తరగతి విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంఈఓ1 సూచించారు. మిషన్ మార్చి కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు.
అలాగే పాఠశాలల్లో నిర్వహించనున్న ఎస్‌ఎంసీ ఎన్నికలను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా నిర్వహించడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.