న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకానికి సుప్రీం ప్రశంసలు.. ఇది ఉచిత తాయిలం కాదు
న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకానికి సుప్రీం ప్రశంసలు.. ‘ఇది ఉచిత తాయిలం కాదు’
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ గ్రామీణ ప్రాంతాల్లో అద్భుత ఫలితాలు ఇచ్చింది: సీజేఐ సూర్యకాంత్
శ్రమదోపిడీ లేని సముచిత పథకమని వ్యాఖ్య
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)పై సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది. ఇది ఉచితంగా పంచే తాయిలం కాదని, గ్రామీణ కార్మికుల శ్రమను దోపిడీ చేసే విధానం కూడా కాదని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం మంచి ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించింది.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏకు బదులుగా కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ గ్రామీణ ఉపాధి పథకం)పై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా.. ‘‘ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ మంచి, సమర్థవంతమైన పథకం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది గణనీయమైన ఫలితాలు ఇచ్చింది. ఇది ఉచిత తాయిలం కాదు.. కార్మిక శక్తిని దోపిడీ చేసే విధానం కాదు’’ అని పేర్కొంది.
ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తామని కొత్త పథకంలో పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పని దినాలు తగ్గిపోయాయని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో ఉన్న డిమాండ్ ఆధారిత, హక్కుల ఆధారిత విధానాన్ని మార్చి కేంద్ర నియంత్రిత విధానంగా మార్చారని విమర్శలు వస్తున్నాయి.
కొత్త విధానం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య ఉన్న 90:10 నిధుల నిష్పత్తిని 60:40కి మార్చారని, దీంతో రాష్ట్రాలు అధికంగా నిధులు భరించాల్సి వస్తోందని వాదనలు వినిపించాయి.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద ఆలస్యమైన వేతనాలను నష్టపరిహారంతో కలిపి వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ హక్కుల కార్యకర్త అరుణా రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, చెరియల్ డిసౌజా, నేహా రాఠి వాదనలు వినిపించారు. గ్రామీణ ఉపాధికి సంబంధించిన చట్టబద్ధ హామీకి రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద ప్రాథమిక హక్కు హోదా కల్పించాలని కోరారు.
‘‘పని చేసే హక్కును రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించలేదు. ఇది ప్రభుత్వ విధాన ఆదేశిక సూత్రాల్లోని ప్రజాస్వామ్య ఆకాంక్ష మాత్రమే. ప్రభుత్వం విధానం ద్వారా ఉపాధి కల్పిస్తుంది. దీనిని 21వ అధికరణతో సమానంగా చూడాలా?’’ అని జస్టిస్ జోమాల్యా బాగ్చి ప్రశ్నించారు.
దీనికి స్పందించిన ప్రశాంత్ భూషణ్.. గౌరవప్రదమైన జీవనం గడిపే హక్కు 21వ అధికరణలో భాగమని తెలిపారు. కనీస వేతనం లేకుండా ఉపాధి కల్పించడం బానిసత్వానికి సమానమని వాదించారు.
కనీస వేతనాల పరిమితి ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేతనాలు నిర్ణయించాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
కొత్త పథకం కింద దాదాపు సగం నిధులను రాష్ట్రాలు భరించాల్సి వస్తోందని ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి అవకాశాలు సగానికి తగ్గాయని, రాష్ట్రాల వద్ద నిధుల కొరత ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత పిటిషన్‌ను పరిష్కరిస్తూ, కొత్త పథకానికి సంబంధించిన అంశాలతో కొత్తగా పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.