పెనుగొలనులో లోక కళ్యాణార్థం నగర సంకీర్తన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం లోక కళ్యాణార్థం నగర సంకీర్తన నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలోని షిరిడి సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియో రూము, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, వాటర్ ట్యాంకు మీదుగా సాగింది.
ఈ సందర్భంగా భక్తులు “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి”, “శ్రీరామ జయరామ జయజయరామ” నామస్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తనలో పాల్గొన్నారు. గ్రామ పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, రాళ్లచర్ల జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
బొడ్రాయి సెంటర్‌లో హనుమాన్ చాలీసా పారాయణం
ఇదిలా ఉండగా శనివారం రాత్రి పెనుగొలను బొడ్రాయి సెంటర్‌లోని అభయాంజనేయ స్వామి ఏకశాల విగ్రహం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.