పుంగనూరులో టీడీపీకి నూతన జోష్..
పుంగనూరులో టీడీపీకి నూతన జోష్.. మధుసూదన్ నాయుడుకు ఘనస్వాగతం
సొంత నిధులతో నూతన టీడీపీ కార్యాలయం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం సమష్టిగా పనిచేస్తామని వెల్లడి
పుంగనూరు | Ntoday News
పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నూతన జోష్ నెలకొంది. నూతనంగా నియమితులైన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన పుంగనూరులో తన సొంత నిధులతో నిర్మించిన నూతన టీడీపీ కార్యాలయాన్ని వేలాది మంది పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకంతో పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన అవకాశాన్ని ప్రజా సేవకు, పార్టీ అభివృద్ధికి వినియోగిస్తానన్నారు.
నియోజకవర్గంలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి టీడీపీని మరింత బలోపేతం చేస్తానన్నారు.
తనకు సహాయ సహకారాలు అందించిన మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్‌నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర షాప్ చైర్మన్ రవి నాయుడుకు మధుసూదన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పుంగనూరు నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి సమష్టిగా పనిచేస్తామని మధుసూదన్ నాయుడు పేర్కొన్నారు. పుంగనూరులో ప్రారంభించిన నూతన టీడీపీ కార్యాలయం ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమాల వివరాలు
ఉదయం 7 గంటలకు కీలకిరి నుంచి ప్రారంభమైన కార్యక్రమాల్లో భాగంగా కురప్పల్లి మశెమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం 7.30 గంటలకు సుగుటూరు గంగమ్మ ఆలయం, 7.45 గంటలకు నూర్షావలి దర్గా, 8 గంటలకు కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం, 8.15 గంటలకు ఎంబీటీ రోడ్డులోని మారెమ్మ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 8.30 గంటలకు నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 10 గంటలకు అంజుమన్ షాదీ మహల్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పార్టీ కార్యాలయంలో మధుసూదన్ నాయుడు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.