ఫ్లెక్సీల తొలగింపులో వివక్షా ?
ఫ్లెక్సీల తొలగింపులో వివక్షా ? మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ వినతి
అధికార పార్టీ ఫ్లెక్సీలు ఉంచి.. మా ఫ్లెక్సీలే తొలగించడం అన్యాయం: బీజేపీ
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు, సిబ్బంది తొలగించడంపై బీజేపీ పట్టణ శాఖ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే పోలీస్ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న కేవలం బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను అలాగే ఉంచడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బీజేపీ ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అన్ని రాజకీయ పార్టీల పట్ల అధికారులు సమానంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించేలా అధికారులు వ్యవహరించాలని వారు కోరారు.