రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి జైపూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం; రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి స్పష్టీకరణ
మంచిర్యాల,:ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల, షెట్ పల్లి కొనుగోలు కేంద్రాలు, బాలాజీ, సుముఖ గోదాములు, ఇందారంలోని వరలక్ష్మి రైస్ మిల్‌లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వనజ రెడ్డిలతో కలిసి ఆయన సందర్శించి, కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎకరానికి 25 క్వింటాళ్ల ధాన్యం వచ్చేదని, ఈసారి దిగుబడి 28 నుండి 32 క్వింటాళ్లకు పెరిగిందని పేర్కొన్నారు. సాధారణంగా జూన్ 6వ తేదీ వరకు జరిగే కొనుగోలు ప్రక్రియను, ఈ సంవత్సరం జూన్ 4వ తేదీ నాటికే 1 లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
రైతుల సంక్షేమంలో భాగంగా పెద్దపల్లి లో 2 గోదాములు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన హమాలీల కొరతను స్థానికులతో భర్తీ చేసి ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. లారీల కొరత రాకుండా సింగరేణి సంస్థతో మాట్లాడి వాహనాలను సమకూర్చామని, అదనంగా 10 ఇసుక లారీలను సైతం ఏర్పాటు చేశామన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రైతులను ఆందోళనల వైపు రెచ్చగొడుతున్నారని, పార్టీలకు అతీతంగా అందరూ రైతుల సంక్షేమం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పంట ఆలస్యంగా వస్తున్న ప్రాంతాల రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, ₹500 సన్న రకం వడ్ల బోనస్, గృహ జ్యోతి వంటి పథకాల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలో 51 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 36 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, పెద్దపల్లి, కరీంనగర్‌లలో హమాలీలతో కూడిన 2 గోదాములను కేటాయించారని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా, 35 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల జైపూర్ సుముఖ గోదాములో ధాన్యాన్ని భద్రపరుస్తున్నామని, అక్కడ 50 మంది హమాలీలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 62 శాతం ట్యాబ్ ఎంట్రీ పూర్తయిందని, సంబంధిత రైతుల ఖాతాలలో 48 గంటలలోగా నగదు జమ చేయడం జరుగుతుందని, మరో 3 రోజులలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మొక్కజొన్న పంట కొనుగోలు లక్ష్యం 8,700 మెట్రిక్ టన్నులు కాగా, ఇంకా 3 వేల మెట్రిక్ టన్నుల పంట సేకరించాల్సి ఉందని, అలాగే మరో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావలసి ఉందని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత ముందుగానే పూర్తి చేసేందుకు రైస్ మిల్లులు, గోదాముల వద్ద పనులు వేగవంతం చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు