www.ntodaynews.com
చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
తెలంగాణ
చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి-- ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
N TODAY NEWS: హైదరాబాద్
చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, నాయకులతో కలిసి చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్య ను హైదరాబాదు కార్యాలయంలో కలిసి వినతి పత్రం శుక్రవారం రోజున అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ్యతో కలిసి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ...రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని,సంక్షోభంలో కోరుకపోయిన చేనేత రంగాన్ని గట్టు ఎక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను,ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.1లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్టు 14 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని,రూ.33 కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల రుణ బకాయిల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నందున సరిపడినన్ని నిధులను విడుదల చేసి రైతన్నల మాదిరిగా నేతన్నలను రుణ విముక్తులను చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత,జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 527 చేనేత సహకార సంఘాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు.టెస్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరిగి చేనేత సహకార సంఘాలు అప్పుల్లో కూరుకపోయాయని,వడ్డీల భారం పెరిగి చాలా చేనేత సంఘాలు మూతపడడంతో కార్మికులకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.చేనేత సహకార సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేసి, బ్యాంకుల ద్వారా కొత్తగా రుణ సహాయం అందించి,మూతబడిన సంఘాలన్నింటినీ తెరిపించాలని కోరారు.సహకార చట్టం ప్రకారం చేనేత సహకార సంఘాలకు 2013లో ఎన్నికల నిర్వహించారని,2018 తో వాటి కాలపరిమితి ముగిసినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు.చేనేత సహకార సంఘాల సమాఖ్య "టెస్కో" కు సైతం పాలకవర్గం లేనందున చేనేతల సంక్షేమం పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సహకార సంఘాలకు, టెస్కోకు ఎన్నికలు నిర్వహించి నూతన పాలకవర్గాలను ఎన్నిక చేసి ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం"నేతన్నకు భరోసా" పథకంలో జియో టాగ్ మగ్గం వేసే చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.18,000, ఒక అనుబంధ కార్మికుడికి రూ.6000 చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించిందని,ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.చేనేత సహకార సంఘాల సమాఖ్య టెస్కో నిర్వహణ బాధ్యతలు,ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించాలని, సహకార సంఘాల పై భారం వెయ్యకూడదని విజ్ఞప్తి చేశారు.చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసి ఈ వృత్తిపై ఆధారపడిన లక్ష మందికి ఏడాది పొడవునా చేతినిండా పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని,చేనేత గ్రామాల్లో డిజైన్లు,రంగుల అద్దకం పై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని,మగ్గాలపై నేసిన వస్త్రాలను కొనుగోలు చేసే ప్రజలకు ప్రభుత్వం 30% డిస్కౌంట్ ఇవ్వాలని,గుంత మగ్గం స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు,ఆధునిక పరికరాలు ఉచితంగా పంపిణీ చేయాలని, ఇందిరమ్మ పథకంలో చేనేత కార్మికులకు వర్క్ షెడ్లు మంజూరు చేయాలని, చేనేత వస్త్రాలపై "0"జిఎస్టిని అమలు చేయించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
తాము చేసిన విజ్ఞప్తికి చేనేత జౌళి, శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ స్పందించారని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని సత్యం వెల్లడించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాషికంటి లక్ష్మీ నరసయ్య, గౌరవాధ్యక్షుడు వెంకట్ రాములు, అధ్యక్షుడు పెండెం సర్వేశ్వర్, నాయకులు జల్దీ రాములు, కస్తూరి బిక్షపతి, కర్నాటి మారయ్య, సురపల్లి జనార్ధన్, దుడుక ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube