తిరువూరు అభివృద్ధికి సీఎం చంద్రబాబు సహకారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భేటీ.. కీలక సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి
ఉండవల్లి, సెప్టెంబరు 5:
ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వివక్షను అరికట్టడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై రాష్ట్రస్థాయి ఉన్నతస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చట్టపరమైన రక్షణలు, బాధితులకు సత్వర న్యాయం అందించే అంశాలపై జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలిసి తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
గత రెండేళ్లలో తిరువూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు రూ.15 కోట్ల నిధులు కేటాయించి ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు
ఏ.కొండూరు మండలంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన కృష్ణా జలాల పథకం పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకం అందుబాటులోకి వస్తే మండల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందడంతో పాటు కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడుతుందని వివరించారు.
కట్టలేరు వంతెన పనులు ప్రారంభించాలని వినతి
తిరువూరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన కట్టలేరు వంతెన నిర్మాణం అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించి నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అనుమతులను త్వరితగతిన మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
‘జయహో బీసీ’పై సీఎంకు వివరించిన ఎమ్మెల్యే
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా తిరువూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ భారీ కార్యక్రమ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.
బీసీల రాజకీయ, సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తిరువూరు నియోజకవర్గ ప్రజల నుంచి లభించిన మద్దతు, కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనను ముఖ్యమంత్రికి తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి అభినందించారు.
తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.