తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం
ఆత్మగౌరవం కోసం మున్సిపల్ చైర్మన్‌గా బరిలోకి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను కలిసేందుకు త్వరలో బైక్ యాత్ర
పూలే–అంబేద్కర్–కాన్షీరామ్ స్ఫూర్తితో రాజకీయ ప్రస్థానం
(ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు)
రానున్న తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసి పట్టణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని ప్రతిపక్ష, ప్రజాపక్ష దళిత సామాజికవేత్త మెహర్ బాబా తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ స్ఫూర్తితో ప్రజల కోసం తన రాజకీయ, సామాజిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించిన కొందరు అనంతరం చైర్మన్ పదవి కోసం రాజకీయ రాజీలు చేసుకుని, డబ్బులకు ఆశపడి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితులు గతంలో చోటుచేసుకున్నాయని మెహర్ బాబా ఆరోపించారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలు రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు, ప్రజలతో ఉన్న సంబంధాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎవరు అవకాశం ఇచ్చినా.. ప్రజల మద్దతుతో బరిలోకి
ఎవరు అవకాశం ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని మెహర్ బాబా తెలిపారు. తిరువూరు మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
విజయ్‌ను కలిసేందుకు బైక్ యాత్ర
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు జోసెఫ్ విజయ్‌ను కలిసేందుకు త్వరలో బైక్ యాత్ర చేపట్టనున్నట్లు మెహర్ బాబా తెలిపారు. ఈ యాత్రలో తిరువూరు నియోజకవర్గానికి చెందిన యువత, నాయకులు, పెద్దలు, సామాజికవేత్తలు పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కోరారు.
బైక్ యాత్రలో తనతో కలిసి ప్రయాణించాలనుకునే యువత 9703666891 నంబర్‌కు ఫోన్ చేసి తమ వివరాలు తెలియజేయాలని కోరారు. యాత్రకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు విలువైన సలహాలు, సూచనలు, సందేశాలు అందించాలని పెద్దలు, నాయకులు, సామాజికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
“కొంచెం ఆలస్యం కావచ్చు.. కానీ మాట తప్పడం, మడమ తిప్పడం నా అలవాటు కాదు. తిరువూరు నగర పంచాయతీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చైర్మన్‌గా పోటీకి సిద్ధంగా ఉన్నా” అని మెహర్ బాబా పేర్కొన్నారు.