కోకిలంపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఖరీఫ్ సాగు, ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాల రాయితీ, ఈ-పంట నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పద్మ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రతికూల ప్రభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్‌లో రైతులు అనుకూలమైన పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న పంట భూముల్లో ఆరుతడి పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 80 శాతం రాయితీపై పెసర, మినుము, కంది, కొర్ర, నువ్వుల విత్తనాలను అందించేందుకు అత్యవసర ప్రణాళికలో అవకాశం కల్పించిందని తెలిపారు.
ఈ పంటలు సాగు చేయదలచిన రైతులు తమ రైతు సేవా కేంద్ర సిబ్బందికి ముందుగా అవసరాన్ని తెలియజేస్తే విత్తనాలను తెప్పించి అందజేస్తామని వివరించారు. ఒక రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీపై విత్తనాలు అందించే అవకాశం ఉందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఖరీఫ్ సీజన్‌లో పంట సాగు చేసిన ప్రతి రైతు తాను సాగు చేసిన ప్రతి పంటను ఈ-పంటలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవడంతో పాటు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతు సేవా కేంద్ర సిబ్బంది కూడా తమ పరిధిలోని అన్ని గ్రామాల్లో సాగు చేసిన ప్రతి పంటను తప్పనిసరిగా ఈ-పంటలో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ-పంట నమోదుకు సెప్టెంబర్ 15, 2026 చివరి తేదీ అని వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు గడువులోగా పంట నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ కావ్య, రైతు సేవా కేంద్ర సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.