విస్సన్నపేటకు చెందిన ఆంధ్రా సైబర్ ఆణిముత్యం
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రేసులో భారత్ కీర్తిని చాటిన తెలుగోడు సత్తా ప్రపంచ దేశాల్లో 16వ ర్యాంక్ సాధించిన యువ సైబర్ సాంకేతిక నిపుణుడు షణ్ముఖ శ్రీ సాయి కొమ్మూరి
విస్సన్నపేట: భారతీయ సైబర్ సెక్యూరిటీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ స్థాయి సంస్థ థింకర్స్360 ప్రకటించిన 2026 సంవత్సరపు భద్రతా విభాగం ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 196 మంది అగ్రస్థాయి నిపుణుల్లో ఎంపికైన 50 మంది మేధావులు, ప్రతిభావంతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు షణ్ముఖ శ్రీ సాయి కొమ్మూరి 16వ స్థానాన్ని సాధించారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం విస్సన్నపేటకు చెందిన షణ్ముఖ శ్రీ సాయి కొమ్మూరి కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం.
24 ఏళ్లకే అరుదైన గుర్తింపు
చిన్ననాటి నుంచే సాంకేతిక రంగంపై ఆసక్తి పెంచుకున్న షణ్ముఖ శ్రీ సాయి సైబర్ సెక్యూరిటీపై ప్రాక్టికల్ పరిశోధన చేస్తూ ముందుకు సాగారు. ప్రాక్టికల్ సైబర్ సెక్యూరిటీ, భద్రతా లోపాల పరిశోధన, చొచ్చుకుపోయే భద్రతా పరీక్షలు, భద్రతా ఇంజినీరింగ్, జ్ఞాన భాగస్వామ్యం వంటి సంక్లిష్ట రంగాల్లో ప్రతిభ కనబరిచారు. వివిధ సంస్థల్లోని భద్రతా లోపాలను ముందుగానే గుర్తించి వాటిపై హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, సైబర్ భద్రతపై నిరంతరం అవగాహన కల్పించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
ఈ ర్యాంకింగ్ ఎందుకు ప్రత్యేకం
థింకర్స్360 అందించే ఈ ర్యాంకింగ్ సాధారణ కోర్సులు, సాంకేతిక ధ్రువపత్రాలు లేదా పరీక్షల ఫలితాల ఆధారంగా మాత్రమే కేటాయించేది కాదు. ఒక నిపుణుడు సాధించిన అనుభవం, ప్రచురించిన పరిశోధనా వ్యాసాలు, ఇచ్చిన ప్రసంగాలు, ప్రసార మాధ్యమాల్లో అందించిన సహకారం, ప్రపంచానికి అందించిన జ్ఞాన భాగస్వామ్యం వంటి వాస్తవిక అంశాలను సమగ్రంగా పరిశీలించి ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో షణ్ముఖ శ్రీ సాయి 16వ స్థానాన్ని సాధించడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరింత నేర్చుకోవడమే లక్ష్యం
ఈ సందర్భంగా షణ్ముఖ శ్రీ సాయి కొమ్మూరి మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మక 2026 ప్రపంచ భద్రతా జాబితాలో స్థానం దక్కడం తన సైబర్ సెక్యూరిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. అయితే ఈ గుర్తింపును గమ్యంగా కాకుండా ఒక మైలురాయిగా మాత్రమే చూస్తున్నానని తెలిపారు.
మరింతగా నేర్చుకోవడం, నిరంతరం పరిశోధనలు చేయడం, ఆచరణాత్మక భద్రతా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని పంచుకోవడమే తన ప్రధాన లక్ష్యమని షణ్ముఖ శ్రీ సాయి పేర్కొన్నారు.
ప్రపంచ సైబర్ వేదికపై భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన ఈ యువ సైబర్ సెక్యూరిటీ నిపుణుడికి పలువురు డిజిటల్ రంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు అభినందనలు తెలియజేస్తున్నారు.