డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా సంఘమిత్ర అవగాహన కార్యక్రమం
పోలీస్–ప్రజల భాగస్వామ్యంతో మాదకద్రవ్యాలపై ఇంటింటా అవగాహన
హన్మకొండ | Ntoday News
డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సంఘమిత్ర’ అవగాహన కార్యక్రమాన్ని హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జిల్లా కలెక్టర్ డా. సత్యశారద, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రజిత తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, మహిళలు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి కుటుంబానికి మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
స్వయం సహాయక సంఘాలు, గ్రామ దీపికలు (VOA), మెప్మా సభ్యులను ‘సంఘమిత్ర’లుగా భాగస్వామ్యం చేసి డ్రగ్స్ వ్యతిరేక అవగాహనను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. సుమారు 1.17 లక్షల మంది సభ్యుల ద్వారా జిల్లాలోని ప్రతి కుటుంబానికి సందేశాన్ని చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
జిల్లా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య కేవలం పోలీస్ శాఖకు సంబంధించినది కాదని, మొత్తం సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య అని పేర్కొన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యాసంస్థలు, మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, యువతపై వాటి ప్రభావం, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరి బాధ్యతపై అవగాహన కల్పించే వీడియోలను ప్రదర్శించారు. వివిధ మహిళా సంఘాలకు చెందిన సభ్యులు, పోలీస్ అధికారులు, వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు.