హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్
250 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ | Ntoday News
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. TCS అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ (HyperVault) ఈ భారీ ప్రాజెక్టును 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో హైపర్‌వాల్ట్ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ స్థాయిలో AI కంప్యూటింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి మరింత ఊతం లభించనుంది.
ఈ డేటా సెంటర్ క్యాంపస్‌ను గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్ వంటి స్థిరమైన సాంకేతిక విధానాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి AI, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడనుంది.