www.ntodaynews.com
చేనేత అనేది ఒక కళ, పోచంపల్లిలో చేనేత కార్మికులతో ముఖాముఖి
తెలంగాణ
చేనేత అనేది ఒక కళ, పోచంపల్లిలో చేనేత కార్మికులతో ముఖాముఖి-- రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
NTODAY NEWS: పోచంపల్లి, జూన్ 12
పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని,గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత కార్మికులతో మాట్లాడటమే కాకుండా,పోచంపల్లి టూరిజం టెక్స్ టైల్ పార్కులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు.అంతేకాక చేనేత కార్మికులతో ముఖా ముఖి మాట్లాడి చేనేత కార్మికుల సంక్షేమం, వారి స్థితిగతులు, సమస్యలను తెలుసుకున్నారు అనంతరం రాష్ట్ర గవర్నర్ టెక్స్ టైల్ పార్కు సమావేశ మందిరంలో నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ చేనేత అనేది ఒక కళ అని ,ప్రత్యేకించి పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఉత్పత్తులు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయని ,ఇటీవల ప్రపంచ సుందరీ మణుల సందర్శనతో 30 శాతం అమ్మకాలు పెరిగాయని తెలియడం సంతోషమని అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను ఎలా తయారు చేస్తారో తాను స్వయంగా చూసి తెలుసుకున్నానని, గతంలో పోచంపల్లి చీరల పై పుస్తకాల్లో మాత్రమే చదివానని, ఇది తనకు మంచి అనుభవం అని అన్నారు. పోచంపల్లి గ్రామంలో చేనేతలో చాలామంది నిష్ణాతులు ఉన్నారని, ఆఫ్ సిల్క్, కాటన్ వంటి అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారని భవిష్యత్తులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు.అయితే పోచంపల్లి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం తో పాటు,మార్కెటింగ్ తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్ లోని ఎన్ఐటి, ఐఐటి సహకారంతో స్థానిక నేత కార్మికులు కలిసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి మార్కెటింగ్ , డిజైనింగ్ ,డయింగ్ అన్ని విషయాల్లో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు . పోచంపల్లి చేనేత కార్మికులతో మాట్లాడిన అనంతరం ఇక్కత్ ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంతేకాక నకిలీ ఇక్కత్ సమస్యను కూడా నేత కార్మికులు చెబుతున్నారని, ఈ రెండింటిని గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు .ప్రస్తుతం పోచంపల్లి నేత కార్మికులు నేతతోపాటు, ఉత్పత్తి ,కలర్ ,మార్కెటింగ్, డిజైనింగ్ అన్ని వారే చూడడం వల్ల ఇక్కత్ ఉత్పత్తులను విస్తృతి చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినట్లయితే చేనేత కార్మికులను కాపాడినవారమవుతామని, ఇక్కత్ చేనేత వారసత్వంగా వస్తున్న ఒక కళ అని అన్నారు.హ్యాండ్లూమ్స్ కూడా హ్యాండీక్రాఫ్ట్ కోవలోకే వస్తాయని, అలాంటి పోచంపల్లి చేనేత ఉత్పత్తులలో భాగంగా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందిన వారు కూడా పోచంపల్లి గ్రామంలో ఉండటం అభినందనీయమని అన్నారు. నేత కార్మికులకు ఉన్న సమస్యలు చాలా చిన్నవని, వాటిని సులభంగా పరిష్కరించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ చీరలు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా, దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లవచ్చని, కార్మికులు ఇలాగే పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు .రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని, ముఖ్యంగా త్రిఫ్ట్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్, రుణమాఫీ, నేతన్న భరోసా, వంటి పథకాల ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు . అలాగే నేత కార్మికుల కోసం ప్రత్యేకించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తున్నామని,ఇందులో భాగంగా 25 వేల రూపాయల నగదు, శాలువాతో సన్మానిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేతలు వివిధ రా ప్రాంతాలలో అభివృద్ధి చెంది ఉన్నాయని, పీతాంబరి చీరలు, ఆర్మూర్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు ప్రసిద్ది అని తెలిపారు.టెస్కో ద్వారా చేనేత మెటీరియల్ సేకరిస్తున్నామని, ఈ సంవత్సరం పోచంపల్లి రా మెటీరియల్ ను 6 కోట్ల రూపాయలతో సేకరిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోచంపల్లి గ్రామానికి ప్రపంచ సుందరి మణులు రావడం వల్ల పోచంపల్లి ఉత్పత్తుల అమ్మకాల మార్కెటింగ్ 30 శాతం పెరిగిందని,అంతే కాక ప్రపంచ వ్యాప్తంగా పోచంపల్లికి ప్రచారం వచ్చిందని ,రాష్ట్ర గవర్నర్ రాకతో పోచంపల్లి మరోసారి ప్రాచుర్యం పొందిందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కు యాదాద్రి భువనగిరి జిల్లాకు త్రిఫ్ట్ పథకం కింద 90 కోట్ల రూపాయలు ఇచ్చిందని, అలాగే రుణ మాఫీ కింద ఆర్థిక సహాయం ఇవ్వనుందని, నేతన్న భరోసా,నేతన్న బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు .యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గవర్నర్ లాంటి వ్యక్తులు నేతన్నలను ప్రోత్సహించడం సంతోషకరమని అన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఐఐటి, ఎన్ఐటి ద్వారా మరింత మెరుగైన విధంగా పోచంపల్లి ఉత్పత్తులను పెంపొందించుకునేందుకు అవకాశాలున్నాయని, పోచంపల్లి లో దశాబ్దాల తరబడి చేనేత కార్మికులు ఉత్పత్తులను తయారు చేస్తున్నారని,ముఖ్యంగా మహిళా కార్మికులు చేనేత చీరల తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని ,దీని ద్వారా ప్రతి నెల 15 నుండి 20 వేల వరకు వారు సంపాదిస్తున్నారని, అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేనేత కార్మికులు అదనపు ఆదాయాని కై ప్రభుత్వానికి నివేదిస్తున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకొని త్వరలోనే మార్కెటింగ్, డిజైనింగ్ వంటివి ఎలా అభివృద్ధి చేయాలో రాష్ట్ర గవర్నర్ సూచనల ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య మాట్లాడుతూ పోచంపల్లి చేనేత ఉత్పత్తులు బాగున్నాయని, అయితే మార్కెటింగ్ సరిగాలేదని, ఈ సమస్యను పరిష్కరిస్తే నేత కార్మికులు బాగుపడతారని, వ్యవసాయ రంగానికి సహకరించినట్లు గానే చేనేత రంగానికి కూడా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ మాట్లాడుతూ పోచంపల్లి గ్రామం ఇక్కత్ కు మాత్రమే ప్రసిద్ధి కాదని, ఇది నాలుగు రకాల సబ్జెక్టులతో ముడిపడి ఉందని నేత, డయింగ్, కలర్ అన్నిరకాల పరిజ్ఞానం ఉన్న కార్మికులు ఇందులో ఉన్నారని, అయితే వీరి కోసం అదనంగా ఏం చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉందని, చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ ఇవ్వాలని, ఇక్కత్ పరిజ్ఞానాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.అంకం పాండు మాట్లాడుతూ ప్రభుత్వం నేత కార్మికుల కోసం అమలు చేస్తున్నవివిధ పథకాల వల్ల నేత కార్మికులకు ఆత్మస్థైర్యం తో పాటు, జీవన ప్రమాణాలు పెరిగాయని ,త్రిఫ్ట్ పథకం వల్ల తనాకు రెండు లక్షల 15 వేల రూపాయలు వచ్చాయని ,పిల్లల చదువుకు వినియోగించానని, అయితే నేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు .భారత గగన అనే నేత కార్మికు రాలు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి తాను మగ్గం నేస్తున్నానని, చిన్నప్పుడే తన భర్త చనిపోతే నలుగురు పిల్లల్ని చేనేత పైన ఆధారపడి బ్రతికించు కుంటున్నానని, ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని పెట్టడం బాగుందని అయితే చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గుర్రం హేమలత మాట్లాడుతూ తాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ పథకంలో చేరి 36 నెలలు రెండు వేల రూపాయల చొప్పున చెల్లించామని, రెండు లక్షలు వచ్చాయని, దీని ద్వారా ఇళ్లు నిర్మించుకున్నని, తమకు చాలా సంతోషంగా ఉందని, మళ్ళీ తిరిగి పొదుపు చేస్తామని తెలిపారు. మరో నేత కార్మికురాలు శశికళ మాట్లాడుతూ చేనేత బీమా పథకం వల్ల చేనేత కార్మికులకు న్యాయం చేకూరుతుందని ,తన భర్తకు పక్షవాతం వస్తే తినడానికి కూడా తిండి లేకుండేదని, ఇప్పుడు చేనేత వల్ల భరోసా వచ్చిందని, చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ ఇవ్వాలని కోరారు. తడక రమేష్ మాట్లాడుతూ చేనేత కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం సంతోషమని మార్కెటింగ్ రంగంలో 600 మంది పోచంపల్లి లో ఉన్నారని, వారికి కూడా జియో ట్యాగింగ్ ఇవ్వాలని వారికి గుర్తింపు ఇవ్వాలని, నకిలీ ఇక్కత్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నకిలీ ని అరికట్టాలని, పోచంపల్లి లో యార్న్ డిపో ఏర్పాటు చేయాలని, కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం లక్ష పదివేల రూపాయలు ఇస్తున్నదని, దానితోపాటు ,ఒక పోచంపల్లి చీర ,దోతిని ఇస్తే బాగుంటుందని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఉపేందర్, భాగ్యలక్ష్మి, యాదగిరి అనే నేత కార్మికులకు నేతన్న రుణాల కింద 5 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. నేతన్న పొదుపు పథకం కింద యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తానికి రెండు కోట్ల పదిహేను లక్షల 25 వేల రూపాయల చెక్కును నేత కార్మికులకు అందజేశారు. అంతకుముందు పార్కులో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలను రాష్ట్ర గవర్నర్ పరిశీలించడమే కాకుండా ,నేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను, జీవన విధానాలను ,ఇక్కత్ ఉత్పత్తుల తయారీలో వారుఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి ఆకాంక్ష యాదవ్ వందన సమర్పణ చేయగా, రాష్ట్ర గవర్నర్ ఓఎస్డి భవాని శంకర్ , భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,ఇతర అధికారులు పాల్గొన్నారు .
Follow us on
Website
Facebook
Instagram
YouTube