కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఏసీబీ దాడులు వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు.. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అదుపులో
నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వాహనాలను నిలిపి వాహనదారుల నుంచి భారీ మొత్తంలో అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ఈ తనిఖీల్లో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన కారును ఆకస్మికంగా తనిఖీ చేయగా రూ.2.48 లక్షల నగదు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నగదుతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
వాహనాలను తనిఖీల పేరుతో నిలిపి అక్రమంగా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గోపీనాథ్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
నగదు ఎక్కడి నుంచి వచ్చింది? వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు జరిగాయా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దాడులు, విచారణ పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.