స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించాలి: దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా ఏంటో చూపించాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆదివారం సాయంత్రం కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో హనుమంతునిపాడు మండల పార్టీ అధ్యక్షుడు యక్కంటి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దద్దాల నారాయణ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా రీజనల్ కో-ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు బలమైన పోటీ ఇవ్వవచ్చని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలు అందించామని దద్దాల నారాయణ యాదవ్ పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా రూ.4.49 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు.
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, అనంతరం వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
సమావేశంలో మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దద్దాల నారాయణ యాదవ్ నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.