స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధం కావాలి
నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపు
గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేస్తాం
పామూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.
ఆదివారం పామూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గంగసాని హుస్సేన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పార్టీ కమిటీ సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై చర్చించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ శ్రేణులకు కీలకమైనవని అన్నారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు అండగా నిలవాలని సూచించారు.
ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు గంగసాని హుస్సేన్ రెడ్డి, గంగసాని లక్ష్మీ, చప్పిడి సుబ్బయ్య, కల్లూరి రామిరెడ్డి, గట్ల విజయభాస్కర్ రెడ్డి, అంబటి కొండారెడ్డి, షేక్ నాయబ్ రసూల్, షేక్ చాంద్ బాషా, ఇర్రి కృష్ణారెడ్డి, షేక్ గయాజ్, శ్రీరామ శ్రీనివాసులు, షేక్ సలీం, సూరిపోగు మాల్యాద్రి తదితరులు మాట్లాడారు.
మండలంలోని గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని వారు తెలిపారు. పార్టీ అభ్యర్థుల కోసం ఐక్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను మండల నాయకత్వం దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. ఆయా సమస్యలను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.