ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కస్తూరిబా, ఆశ్రమ పాఠశాలలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల/కాసిపేట: ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులతో పాటు వంటశాల, స్టోర్ రూమ్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడలు, అదనపు గదులు తదితర సకల సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే, విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, వంట తయారీలో కచ్చితమైన శుభ్రతా నిబంధనలు పాటించడంతో పాటు నిత్యావసర సామగ్రిని క్రమ పద్ధతిలో నిల్వ ఉంచాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించి పనుల వేగం పెంచేలా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న మరమ్మత్తు పనులను సైతం ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు