www.ntodaynews.com
పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి కాంతులు
తెలంగాణ
పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి కాంతులు
మూడు రోజుల సంక్రాంతి మహోత్సవాలకు శ్రీకారం Ntoday News: కాకినాడ జిల్లా – పిఠాపురం గొల్లప్రోలు మండల రిపోర్టర్: బోర శివారెడ్డి పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. అచ్చ తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన సంక్రాంతి మహోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సంబరాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. డప్పుల శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు, గరగ నృత్యాలు, వీర నాట్య రీతులు, కోలాటాల సందడితో పిఠాపురం పల్లె సంస్కృతికి వేదికగా మారింది. గోపూజలు నిర్వహించి, హరిదాసుల కీర్తనలు ఆస్వాదించిన ఉప ముఖ్యమంత్రి, రంగవల్లులతో అలంకరించిన ప్రాంగణంలో ప్రకృతికి పూజలు చేశారు. జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యాలను ప్రేక్షకులతో కలిసి తిలకించారు.
సంక్రాంతి మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్‌ను ప్రారంభించి, భారతీయ హస్తకళల శైలిని పరిశీలించారు. చేనేత, జౌళి, చేతివృత్తులు, మహిళా–శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, చేనేత కళాకారులతో ముచ్చటించారు. స్వయంగా రాట్నం వడికి, మగ్గాన్ని పరిశీలించారు. ఉప్పాడ చీరలు, కలంకారీ వస్త్రాలపై అద్దిన కళలను ఆసక్తిగా తిలకించారు.
గిరిజన సంప్రదాయ నృత్యాలైన థింసా, కొమ్ముకోయల నృత్యాలు ఉప ముఖ్యమంత్రిని విశేషంగా ఆకట్టుకున్నాయి. థింసా కళాకారులతో కలిసి అడుగులు వేసి నృత్యం చేశారు. హరిదాసులకు సంప్రదాయబద్ధంగా ధాన్యం, ధనం, కూరగాయలు, పండ్లతో కూడిన స్వయంపాక దానం చేశారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ స్టాల్‌లో వరితో పాటు వివిధ రకాల సిరిధాన్యాల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం, చిన్నారులకు భోగి పళ్ల మహోత్సవాల్లో పాల్గొని ఆశీర్వాదం అందించారు. ఏటికొప్పాక లక్క బొమ్మలు, బొబ్బిలి వీణలను పరిశీలించి, వీణ స్వరాలను ఆస్వాదించారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రాల వివరాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, జానపద కళల అకాడమీ ఛైర్మన్ వంపూరి గంగులయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కృష్ణంరాజు, ఏఎంసీ ఛైర్మన్ వాకపల్లి దేవి, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్, నటులు హైపర్ ఆది, ఆర్‌కే సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube