రామన్నపాలెంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత ఫలితాలు సాధించవచ్చు
మేధావుల జీవిత చరిత్రలను విద్యార్థులు చదవాలి
రామన్నపాలెం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రగతి ఉన్నత పాఠశాల వ్యవస్థాపకుడు వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ గురువులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని, క్రమం తప్పకుండా చదువుకుంటే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు, గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రలను తప్పనిసరిగా చదవాలని పిలుపునిచ్చారు. వారి జీవితాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులపై అభిమానాన్ని చాటుకున్నారు. వివిధ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. ప్రభాకర్, ఉపాధ్యాయులు కోట వెంకటేశ్వర్లు, కోట ప్రకాష్, కోట సూర్యరాణి, బి. కిరణ్ కుమారి, బి. శాంతకుమారి, పి. రామకుమారి, కే. మాధవి, జి. ఉమా, ఎం. మాధవి తదితరులు పాల్గొన్నారు.