www.ntodaynews.com
తిరోగమన జాతీయ కార్మిక విధానం
తెలంగాణ
తిరోగమన జాతీయ కార్మిక విధానం
NTODAY NEWS:
– వ్యాసకర్త : పి.అజయ కుమార్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
కేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ కార్మిక, ఉపాధి విధానం ముసాయిదాను ప్రకటించింది. దీనిని భాగస్వాముల కోసం చర్చకు, స్పందనకు పెట్టింది. ఈ విధానాన్ని సిఐటియు వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక మంత్రికి లేఖ రాసింది. జాతీయ కార్మిక, ఉపాధి విధానం ఖరారు కావడానికి ముందుగా వెంటనే భారత కార్మిక మహాసభను సమావేశపరిచి, త్రైపాక్షిక యంత్రాంగంగా ఉన్న ఆ మహాసభలో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని కోరింది. ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఐక్యంగా కూడా ఈ డిమాండ్‌ను లేవనెత్తే అవకాశం ఉంది.
జాతీయ కార్మిక విధానం అమల్లోకి వస్తే వివిధ సంస్థల రూపురేఖలే మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇందులో ముఖ్యంగా కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ ఇకనుండి నియంత్రణ, తనిఖీల నుండి జాతీయ ఉపాధి సహాయకునిగా మారుతుంది. భారత కార్మిక మహాసభ స్థానంలో మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, పారిశ్రామిక మరియు కార్మిక సంఘాలను సంవత్సరానికోసారి ఒకే వేదికల మీదకు తీసుకువచ్చే సమావేశాలు జరుగుతాయి. పరిశ్రమలు, ప్రభుత్వాలు, కార్మికుల గ్రూపులకు సమాన ప్రాతినిధ్యం విస్మరించబడుతుంది. కార్మిక వ్యతిరేక పక్షపాతం చూపించబడుతుంది.
లేబర్ మార్కెట్ సంస్కరణలు ఏవైతే ఇప్పుడు అమలులోకి వచ్చాయో లేదా రాబోతున్నాయో వాటికి అవసరమైన సంస్థాగత ఏర్పాటును జాతీయ కార్మిక విధానం రూపొందించింది. దేశ స్థాయిలో జాతీయ కార్మిక, ఉపాధి విధాన అమలు కౌన్సిల్ ఏర్పడుతుంది. పని అనుసంధానానికి మంత్రిత్వ శాఖల గ్రూపులు ఏర్పడతాయి. రాష్ట్ర స్థాయిలో కార్మిక ఉపాధి మిషన్, జిల్లా స్థాయిలో కార్మిక వనరుల కేంద్రాలు ఉంటాయి. దేశస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా పరిశ్రమలకు కావలసిన కార్మికులను సమకూర్చే కేంద్రాలుగా ఇవి ఉంటాయి మినహా కార్మిక చట్టాలను అమలు చేసే కేంద్రాలుగా ఇవి పనిచేయవు.
పురాతన ధర్మశాస్త్రాలకు ప్రతిరూపమైన మనుస్మృతిని జాతీయ కార్మిక విధానం ఆదర్శంగా తీసుకుంది. పురాతన కాలంలో శూద్రులుగా ఉన్న శ్రామికులను దోపిడీ చేయడానికి, అణచిపెట్టడానికి మనుస్మృతి ఏ విధంగా తోడ్పడిందో అదే విధంగా ప్రస్తుత కాలంలో జాతీయ కార్మిక విధానం ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్మిక శ్రమకు ఎటువంటి రక్షణ లేకుండా చేసి చౌకగా కొల్లగొట్టే ఏర్పాట్లు చేసింది. కానీ అదే సమయంలో తేనె పూసిన మాటలు కొన్ని చెప్పింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన సమానత్వ హక్కు, వివక్షత లేని సమాన అవకాశాలు, అసోసియేషన్లు, యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛ గురించి మాట్లాడింది. శ్రమకు గౌరవం, మానవత్వంతో కూడిన పని పరిస్థితులు, ఇంకా ముఖ్యంగా ఉన్నత దశలో ఉన్న జీవన వేతనం గ్యారంటీని పేర్కొంది.
కానీ జాతీయ కార్మిక విధానం ఎక్కడా కూడా కార్మికులు ఎదుర్కొంటున్న అమానవీయ పరిస్థితులను సమీక్షించలేదు అనడం కంటే సమీక్షించదలుచుకోలేదు అనడం మంచిది. కార్మిక చట్టాలను అమలు చేయించేందుకు అవసరమైన తనిఖీలను పాలకులు నిలిపివేశారు. యూనియన్లు పెట్టుకుంటే కార్మికులను, నాయకులను తొలగిస్తున్నారు. చట్ట ప్రకారం సమ్మె చేసినా కార్మికులకు యజమానులు ఉద్వాసన చెబుతున్నారు. చట్ట ప్రకారం 8 గంటలు పని చేయాల్సి ఉన్నా, కార్మికులతో బలవంతంగా 10, 12 గంటల పాటు పని చేయించుకుంటున్నా కూడా, వారిని రక్షించే పనిలో కార్మిక శాఖ లేదు.
జాతీయ కార్మిక విధానం లేబర్ కోడ్స్‌ను సమర్ధించింది. మెజార్టీ కార్మికులను కార్మిక చట్టాల పరిధి నుండి తొలగించిన లేబర్ కోడ్స్‌ను ఒకపక్క సమర్థిస్తూ, మరోపక్క సార్వత్రికంగా కార్మికులందరినీ కలుపుకు పోతామని బొంకింది. ఎటువంటి కార్మిక హక్కులను పొందేందుకు సాహసించలేని నిర్ధారిత కాల ఉద్యోగాలను ప్రవేశపెట్టిన, కార్మికులను అతి తేలిగ్గా తొలగించే అధికారాలు ఇచ్చిన లేబర్ కోడ్స్‌ను సమర్థిస్తూ, మరోపక్క మానవీయతతో కూడిన పని పరిస్థితుల గురించి మాట్లాడి మభ్యపెట్టింది.
ఇప్పటికే తనిఖీలు లేకుండా చేసిన విధానాన్ని జాతీయ కార్మిక విధానం సమర్ధించింది. ఫిర్యాదుల ఆధారంగా చట్టాల అమలు స్థానంలో, ఫలితాల ఆధారిత అమలును ప్రతిపాదించింది. అంటే, ఉదాహరణకి ఫార్మా లేదా రసాయనిక పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే అక్కడ అప్పుడు నియమాలను పాటించకపోవడంపై తనిఖీ ఉంటుంది మినహా, ముందుగా తనిఖీలు ఉండబోవనే ఈ విధానం పరోక్షంగా స్పష్టం చేసింది.
సామాజిక భద్రతా పథకాల విలీనాన్ని జాతీయ కార్మిక విధానం ప్రతిపాదించింది. ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జాతీయ ఉపాధి కల్పన సర్వీసులు (ఎన్.సి.ఎస్), ఈ-శ్రమ పథకాలను మిళితం చేస్తుంది. మిళితం కాబడిన సామాజిక భద్రతా పథకానికి కార్మికుల నుండే నిధులు సమకూరుతాయి. పథకాలకు బడ్జెట్ నుండి ప్రభుత్వం నిధులు కేటాయించదు. కొత్త పెన్షన్ పథకం మాదిరిగానే మొత్తం సామాజిక భద్రత మారిపోతుంది. కొత్త పెన్షన్ పథకం (న్యూ పెన్షన్ స్కీం)లోకి ఏ విధంగా సిపిఎస్ తదితర రూపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు-ఇన్సూరెన్స్ ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు తాము చెల్లించే నిధులతో ఏకం చేయబడ్డారో…కార్మిక, ఉద్యోగ వర్గాలు తాము చెల్లించే నిధులతోనే సామాజిక భద్రతా పథకంలో ఏకం చేయబడతారు. ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు బాధ్యత లేకుండా పోతుంది.
మోడీ ప్రభుత్వం జాతీయ కార్మిక విధానంలో జీవన వేతనం ప్రస్తావన చేసింది. స్కీం కార్మికులకు, అసంఘటిత కార్మికులకు కనీస వేతనం ఇవ్వడానికే సిద్ధం కాని మోడీ ప్రభుత్వం, వేతన ఉన్నత స్థాయి రూపమైన జీవన వేతన ప్రస్తావన చేసి మభ్యపెట్టింది. తను వేసిన కమిటీ జాతీయ కనీస వేతనాన్ని రోజుకు 375 రూపాయలుగా నిర్ధారించాలని సిఫార్సు చేసింది. అది కూడా అతి తక్కువ వేతనం. దాన్ని కూడా అంగీకరించకుండా కేవలం రోజుకు రూ.178 మాత్రమే అంతిమంగా ఖరారు చేసింది. దీనిని బట్టి జాతీయ కార్మిక విధానం రూపురేఖలు ఏ విధంగా కార్మిక వ్యతిరేకంగా ఉంటాయో ముందుగానే అంచనా కట్టవచ్చు.
యజమానులు తమంతట తామే స్వచ్ఛందంగా ప్రమాణాలను పాటించే విధానాన్ని జాతీయ కార్మిక విధానం ప్రతిపాదించింది. లేబర్ మార్కెట్ సంస్కరణలు కోరుకునేది ఇదే. మధ్యలో చట్టాలు, తనిఖీలు, ఆటంకాలు లేకుండా చేసి మార్కెట్ మీదికి కార్మికులను నెట్టివేసే విధానమే లేబర్ మార్కెట్ సంస్కరణల సారాంశం. పని చేయకుండా పొట్ట గడుపుకోవడానికి మార్గం లేని కార్మికులు తమ శ్రమను చౌకగా అమ్ముకునే పరిస్థితికి జాతీయ కార్మిక విధానం తీసుకొస్తుంది.
కార్మిక, ఉపాధి విధానాన్ని మూల్యాంకనం చేసే సూచిక (ఇండెక్స్)ను ప్రవేశపెడతారు. ఎలాగైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (తేలికగా వ్యాపారాలు చేసుకోగలగడం) అమలుపై రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తున్నారో, జాతీయ కార్మిక ఉపాధి విధానం అమలుపై కూడా ర్యాంకులు ఇస్తారు. ఇక నుండి రాష్ట్రాలు పోటీలు పడి ర్యాంకుల సాధనలో నిమగమై కార్మిక హక్కులకు, గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులకు పాతర వేస్తాయి.
లేబర్ సంస్కరణల అమలు కోసం నిధులను సమీకరిస్తారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థల నుండి వనరులను సమీకరించి లేబర్ సంస్కరణల యంత్రాంగాన్ని రూపొందిస్తారు. వెంటనే కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై జాతీయ కార్మిక ఉపాధి విధానాన్ని తిప్పి కొట్టడం మినహా మరో మార్గం లేదు.
Source:- ప్రజా శక్తి
– వ్యాసకర్త : పి.అజయ కుమార్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
Follow us on
Website
Facebook
Instagram
YouTube