www.ntodaynews.com
ఉగాది ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
తెలంగాణ
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఉత్సవ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
భారీ రద్దీ అంచనా
ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారని కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరం సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకున్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్చి 2 నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.
త్రాగునీరు – వైద్య సదుపాయాలు
రోజుకు 4–5 లక్షల నీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని ఆదేశించారు. మార్చి 8 నుంచి ప్రధాన ప్రదేశాలు, పార్కింగ్ ప్రాంతాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓకు సూచించారు. బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేక డస్ట్‌బిన్లలో సేకరించి తక్షణం నిర్వహించాలని తెలిపారు.
పారిశుద్ధ్యం – మౌలిక వసతులు
పారిశుద్ధ్య పనులను ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్ శాఖలు పర్యవేక్షించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాత్కాలిక షెడ్లు, విద్యుత్ లైన్ల భద్రతపై ఆర్ అండ్ బి శాఖ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
పార్కింగ్ – ట్రాఫిక్ నిర్వహణ
పార్కింగ్ ప్రాంతాల్లో తగినంత వెలుతురు, త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. వాహనాల తరలింపుకు క్రేన్లు, టోయింగ్ వాహనాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. లింగాలగట్టు, పాతాళగంగా ప్రాంతాల్లో ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని మత్స్యశాఖకు సూచించారు.
భాషా సేవలు – భక్తుల సౌకర్యం
తెలుగు, కన్నడ భక్తుల కోసం ‘మే ఐ హెల్ప్ యూ’ కేంద్రాలను పెంచాలని ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కన్నడలోనూ ప్రకటనలు అందించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.
దర్శన ఏర్పాట్లు
రోజుకు 8,000 నుంచి 10,000 మందికి స్లాట్ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో స్లాట్ రెండు గంటల పాటు ఉండగా, ఎనిమిది గంటల పాటు స్లాట్ దర్శనం నిర్వహించి, మిగిలిన సమయంలో ఉచిత దర్శనం కొనసాగుతుందని పేర్కొన్నారు.
భద్రతపై ఎస్పీ సూచనలు
ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ దర్శన సమయాలను డిస్ప్లే బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. టోల్ మినహాయింపు (మార్చి 16–19), పాతాళగంగా బోటు సేవల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే వాలంటీర్లను నియమించే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
అటవీ శాఖ అధికారులు పాదయాత్ర మార్గాల్లో ఫైర్ వాచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థాన ఈఓ శ్రీనివాసులు ఉత్సవ ఏర్పాట్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, డిఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
#Srisailam #UgadiFestival #Nandyal #TempleAdministration #PublicArrangements #AndhraPradeshNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube