విజయవాడ పోలీస్ కమిషనరేట్‌పై సాక్షి కథనం పూర్తిగా అవాస్తవం.. నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
విజయవాడ పోలీస్ కమిషనరేట్‌పై సాక్షి దినపత్రికలో "బెజవాడ బాస్ భారీ డీల్!" అనే శీర్షికతో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం, అభూతకల్పనతో కూడినదని, అందులో పేర్కొన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ కథనం విజయవాడ పోలీస్ కమిషనరేట్, ఉన్నతాధికారుల ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ప్రచురించబడిందని పేర్కొంటూ పోలీసులు తీవ్రంగా ఖండించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 జూన్ 26న విరమల్లు గణేష్ చంద్ర అనే బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అద్విక ట్రేడింగ్ కంపెనీలో రూ.53 లక్షలు డిపాజిట్ చేసినట్లు, కంపెనీ యజమాని తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య మోసపూరిత మాటలు నమ్మించి డబ్బులు తీసుకున్నాడని, అనంతరం కేవలం రూ.13 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి కంపెనీని మూసివేసి పరారైనట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 248/2025 కింద బీఎన్‌ఎస్ చట్టంలోని పలు సెక్షన్లు మరియు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-1999 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. అనంతరం క్రైమ్ డీసీపీ డాక్టర్ కె. తిరుమలేశ్వర రెడ్డి ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, 11 మంది సీఐలు, 11 మంది ఎస్‌ఐలు మరియు ఇతర సిబ్బందితో కూడిన ఈ బృందం అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా, చట్టబద్ధంగా విచారణ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
సాక్షి దినపత్రికలో పేర్కొన్నట్లుగా కేసును కేవలం రూ.53 లక్షల ఫిర్యాదుకే పరిమితం చేయలేదని, కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన మొత్తం ఆర్థిక వ్యవహారాలను లోతుగా పరిశీలించినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా కంపెనీకి సంబంధించిన 17 బ్యాంకు ఖాతాల్లో జరిగిన 42,875 లావాదేవీలను విశ్లేషించారు. ఈ విచారణలో మొత్తం 1,334 మంది డిపాజిటర్లు, 61 మంది ఏజెంట్లను గుర్తించారు.
అద్విక ట్రేడింగ్ కంపెనీ ప్రజల నుంచి మొత్తం రూ.478.34 కోట్లు సేకరించినట్లు గుర్తించగా, అందులో రూ.422.23 కోట్లు వివిధ బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లింపుల రూపంలో వెళ్లినట్లు నిర్ధారించారు. పూర్తి ఆర్థిక విశ్లేషణ అనంతరం బాధితులకు జరిగిన నికర నష్టం రూ.142.40 కోట్లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మొత్తం 1,334 మంది బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. నిందితులు సమర్పించిన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) ఫోరెన్సిక్ నిపుణులచే పరిశీలించగా, వాటిపై ఉన్న సంతకాలు నిందితులవేనని నిర్ధారణ అయినట్లు తెలిపారు.
దర్యాప్తులో కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదా ఎన్‌బీఎఫ్‌సీ నమోదు లేకుండానే ప్రజల నుంచి అధిక లాభాలు వస్తాయని నమ్మించి డిపాజిట్లు సేకరించినట్లు తేలిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు లేకుండానే పొంజీ పద్ధతిలో వ్యాపారం నిర్వహించినట్లు నిర్ధారించామని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మొత్తం 39 మంది నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.67 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లోని రూ.9.38 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 738 గ్రాముల బంగారం, సుమారు 7 కిలోల వెండి, నాలుగు కార్లు మరియు ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అలాగే నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి మూడు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా సుమారు రూ.110 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
దర్యాప్తు అధికారి పేరుతో ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవడంపై వచ్చిన ఆరోపణలను కూడా పోలీసులు ఖండించారు. అధిక మొత్తంలో లబ్ధి పొందిన కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా రూ.7,93,55,788లను ఆ ఖాతాలో జమ చేశారని, ఆ మొత్తాన్ని కోర్టు ఖాతాకు బదిలీ చేసేందుకు 2026 ఏప్రిల్ 24నే పిటిషన్ దాఖలు చేశామని, ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు.
అందువల్ల "రూ.300 కోట్ల కేసును రూ.53 లక్షలకు పరిమితం చేశారు", "పోలీసులు భారీ డీల్ కుదుర్చుకున్నారు", "కేసును సెటిల్ చేశారు", "పోలీస్ బాస్ ప్రత్యేక ఖాతాలో భారీ మొత్తాలు జమయ్యాయి" వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారాలు లేని అభూతకల్పనలని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ కేసులో ప్రతి రూపాయి నిధుల ప్రవాహాన్ని గుర్తిస్తూ పూర్తి ఫైనాన్షియల్ రీకన్సిలియేషన్ నిర్వహించామని, బ్యాంకు రికార్డులు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ నివేదికలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా పటిష్టమైన అభియోగపత్రం సిద్ధం చేసినట్లు తెలిపారు.
పోలీసు శాఖపై ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి, అక్రమ ఒప్పందాల ఆరోపణలు చేయడం విచారకరమని, ఇటువంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అపోహలు సృష్టించడమే కాకుండా దర్యాప్తు ప్రక్రియపై అనవసర అనుమానాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి నిరాధార కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
వాస్తవాలను నిర్ధారించకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన చర్య అని, ఈ తరహా అసత్య ప్రచారం చేసిన వ్యక్తులు లేదా సంస్థలపై సంబంధిత చట్టాల ప్రకారం తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు హెచ్చరించారు.
అలాగే భవిష్యత్తులో ఏదైనా కథనం ప్రచురించే ముందు సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని పత్రికా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
ఈ మీడియా సమావేశంలో డీసీపీలు డాక్టర్ కె. తిరుమలేశ్వర రెడ్డి ఐపీఎస్, కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్, షిరిన్ బేగం ఐపీఎస్, కె.జి.వి. సరిత ఐపీఎస్, కె. కృష్ణ ప్రసన్న ఐపీఎస్, బి. లక్ష్మీనారాయణ ఐపీఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.