www.ntodaynews.com
ఆహార కల్తీపై కఠిన వైఖరి
తెలంగాణ
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు
-హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక NTODAY NEWS: హైదరాబాద్ ఆహార కల్తీ నిరోధానికి పోలీసు–ఫుడ్ సేఫ్టీ అధికారుల సన్నాహక సమావేశం నగరంలో ఆహార కల్తీని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నట్లు తెలిపారు.
ఆహార కల్తీని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సీపీ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆహార కల్తీని చిన్నపాటి నేరంగా తాము చూడడం లేదని, ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే హత్యాయత్నంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారులే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆహార కల్తీ నియంత్రణలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సవాళ్లు, చేపట్టాల్సిన చర్యలపై పోలీసు, ఆహార భద్రతా అధికారులతో సమీక్షించారు. అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, కల్తీ నివారణకు SOPను రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్ చేయడం, అరెస్టుల ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, కల్తీ కేసుల్లో పదేపదే పట్టుబడితే వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే సమాచారం అందించేందుకు త్వరలో ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెడతామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డెవిస్, డీసీపీలు శ్వేత, అపూర్వ రావు, రూపేష్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, డీఎఫ్‌సీ (రిటైర్డ్) విజయ్ కుమార్, ఏఎఫ్‌సీలు బాల్ రాజు, ఆనంద రావు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జగ్గా రెడ్డి, అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube