BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

అయ్యో రామా..! దొంగల చేతుల్లో అయోధ్య? రామాలయ నిధులపై రూ.200 కోట్ల దుర్వినియోగ ఆరోపణలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 06:24 AM
27 వీక్షణలు

మాజీ కరసేవకుడు సంతోశ్ దూబే సంచలన ఫిర్యాదు

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సహా పలువురిపై ఆరోపణలు

మూడు ఫిర్యాదులు నమోదైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని యూపీ పోలీసులు

మోడీ-యోగి ప్రభుత్వాల మౌనంపై ప్రతిపక్షాల విమర్శలు

న్యూఢిల్లీ: దేశంలో హిందూత్వ రాజకీయాల కేంద్రబిందువుగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు అవినీతి, నిధుల దుర్వినియోగ ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్యమంలో పాల్గొన్న మాజీ కరసేవకుడు సంతోశ్ దూబే స్వయంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది భక్తులు సమర్పించిన విరాళాల్లో రూ.200 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు ఫిర్యాదులు పోలీసులకు అందినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

రాముడి సంపదను దోచుకుంటున్నారన్న ఆరోపణలు

అయోధ్య రామమందిర నిర్మాణాన్ని దేశభక్తి, హిందూ ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రచారం చేసిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలకు ఇప్పుడు అదే ఆలయానికి సంబంధించిన ఆరోపణలు ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రామజన్మభూమి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సంతోశ్ దూబే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాతో పాటు ఇతరులపై నిధుల దుర్వినియోగ ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రతిరోజూ ఆలయ హుండీల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాల రూపంలో భారీగా విరాళాలు వస్తున్నాయని, వాటిలో గణనీయమైన భాగం అక్రమ మార్గంలో మాయమైందని ఆయన ఆరోపించారు. ఆలయాన్ని కాపాడాల్సిన వారే రాముడి సంపదను దోచుకుంటున్నారని, భక్తుల విశ్వాసాన్ని మోసం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఈ దేశంలో రాముడికీ భద్రత లేదా?’

బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి మూడు దశాబ్దాలకు పైగా గడిచింది. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో రామాలయ ప్రతిష్ఠాపన జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న సంతోశ్ దూబే ఇప్పుడు “ఈ దేశంలో రాముడికీ భద్రత లేదా? ఆలయాన్ని కాపాడాల్సిన వారే రామాలయ సంపదను దోచుకుంటున్నారు. భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దోచుకుంటున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంఘ్ పరివార్ తరచూ విదేశీ దండయాత్రదారులుగా పేర్కొనే బాబర్, ఘజినీల కంటే నేటి పరిస్థితి మరింత బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. రామాలయం దొంగల చేతుల్లో పడిపోయిందనే బాధ తనను వెంటాడుతోందని చెప్పారు. 2003-04 నుంచే ఆలయ విరాళాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రూ.200 కోట్ల విరాళాలు మాయమయ్యాయా?

ధర్మసేన భారత్ సంస్థను నడుపుతున్న సంతోశ్ దూబే ఒక పేజీ ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిరోజూ రామభక్తులు హుండీల్లో నగదు, బంగారం, వెండి నాణేలు, ఆభరణాల రూపంలో రూ.1 కోట్లకు పైగా విరాళాలు సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విరాళాల నిర్వహణ బాధ్యత ట్రస్ట్ సభ్యులదేనని తెలిపారు.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బన్సల్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు, అలాగే చంపత్ రాయ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్నూ తదితరులు కుమ్మక్కై ఆలయ నిధులను కాజేశారని ఆరోపించారు. ఈ కుట్ర ద్వారా రూ.200 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, వెండి విరాళాలు మాయమైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

“సంబంధిత వ్యక్తులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. దర్యాప్తులో భాగంగా పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈ దుర్మార్గపు చర్య వల్ల నాతో సహా యావత్ హిందూ సమాజం మనస్తాపానికి గురైంది” అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై విమర్శలు

గత మూడు దశాబ్దాలుగా ‘అయోధ్యలో రామమందిరం’ నినాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న బీజేపీ ఇప్పుడు ఈ ఆరోపణల విషయంలో మౌనం పాటిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1990ల నుంచి రామమందిర ఉద్యమాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్న బీజేపీ, అదే అంశంతో దేశవ్యాప్తంగా తన రాజకీయ ప్రభావాన్ని విస్తరించుకుంది.

అయితే ప్రస్తుతం రామాలయం కేంద్రంగా వస్తున్న ఆరోపణలు యూపీలోని బీజేపీ ప్రభుత్వ హయాంలోనే చోటుచేసుకోవడంతో కాషాయ పార్టీ ఆత్మరక్షణలో పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2024లో ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రాజకీయ ప్రచార వేదికగా మలిచారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు అదే ఆలయానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

చిన్నచిన్న కేసుల్లో బుల్డోజర్ రాజకీయాలు చేసే యోగి ప్రభుత్వం, రామమందిర నిధుల వ్యవహారంలో మాత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం ప్రశ్నార్థకమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సాధారణ ప్రజలపై వేగంగా చర్యలు తీసుకునే యంత్రాంగం, కోట్లాది మంది భక్తుల విరాళాలకు సంబంధించిన ఆరోపణల విషయంలో ఎందుకు నెమ్మదిగా వ్యవహరిస్తోందని ప్రశ్నిస్తున్నారు.

భూముల కొనుగోళ్లపై అనుమానాలు

ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని భూముల కొనుగోళ్లు కూడా గతంలో వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వ రేటు ప్రకారం సుమారు రూ.3 కోట్ల విలువ ఉన్న భూమిని రూ.23.61 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

మరో భూమిని ప్రభుత్వ రేటుతో పోలిస్తే దాదాపు 900 శాతం అధిక ధరకు కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపుతున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఈ భూముల్లో కొన్ని ప్రభుత్వ నజూల్ భూములుగా నమోదై ఉన్నాయని, అలాంటి భూములపై ప్రైవేటు లావాదేవీల చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రామాలయం పేరుతో తక్కువ విలువ ఉన్న భూములను అధిక ధరలకు కొనుగోలు చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శకులు చెబుతున్నారు.

రాజకీయంగా తీవ్ర దుమారం

ఈ వివాదం ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

సంతోశ్ దూబేతో పాటు కాంగ్రెస్ నేత శరద్ శుక్లా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఆలయ విరాళాల లెక్కలు, ఆడిట్ నివేదికలు, సీసీటీవీ రికార్డులను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా ట్రస్ట్ ఆడిట్ నివేదికలు ప్రజలకు అందుబాటులో లేవని కూడా ప్రశ్నిస్తున్నారు.

కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామాలయానికి సంబంధించిన ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలపై పారదర్శక దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆరోపణలపై అధికారిక దర్యాప్తు ప్రారంభం కాకపోవడం, ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.