మర్లపాడు హైస్కూల్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
మర్లపాడు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన మర్లపాడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పెద్దలు ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మండల కాంగ్రెస్ నాయకుడు సూరం శెట్టి కిషోర్ మాట్లాడుతూ.. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులను సన్మానించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెనుమత్స భీమరాజు మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ఉత్తమ గురువుల బోధన, మార్గదర్శకత్వంతో మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని, స్వయంగా తన కాళ్లపై తాను నిలబడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప పౌరులుగా విద్యార్థులు తయారు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు శీలం వెంకటరెడ్డి, తెరాస నాయకుడు వేమిరెడ్డి పెద్ద నాగిరెడ్డి, మర్లపాడు గ్రామ సర్పంచి వేల్పుల వెంకటరావమ్మ, సైదెల్లిపురం సర్పంచి ధనలక్ష్మి, మర్లపాడు గ్రామపంచాయతీ ఉపసర్పంచి సూరం శెట్టి రాము, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నెల్లూరు నాగమణి, రామిశెట్టి సత్యనారాయణ, వార్డు సభ్యుడు రామిశెట్టి రాంబాబు, రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.