రాహుల్, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టుపై భగ్గుమన్న కాంగ్రెస్
రాహుల్, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టుపై భగ్గుమన్న కాంగ్రెస్: మంచిర్యాలలో భారీ నిరసన
మంచిర్యాల :కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆదేశాల ప్రకారం మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్క్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, ప్రజా సమస్యలపై గొంతు విప్పుతున్న భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తూముల నరేష్, కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో లాఠీచార్జ్ చేయించడం అత్యంత సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, యువత, నిరుద్యోగులు మరియు మహిళా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై ఈ రకమైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు