విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తాం – టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య
వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తాం – టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య
వికలాంగుల హక్కుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య
యాదగిరిగుట్ట, NToday News:వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు, విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్ అధ్యక్షత వహించారు. శిక్షణ తరగతుల ప్రారంభ సూచికగా సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వికలాంగులకు మరింత అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఉన్నత విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.75 కోట్ల రూపాయల నిధులతో 80 వేల మంది వికలాంగులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 4372 మంది వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, రెండో దఫా ఇందిరమ్మ ఇండ్లలో కూడా 5 శాతం కోటా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కోర్టు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల లోపు అంగవైకల్యం ఉన్న చిన్నారులకు బాల భరోసా పథకం ద్వారా ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి పొందుతున్న వికలాంగులకు విద్యార్హతలతో సంబంధం లేకుండా రిట్రోఫిటెడ్ వాహనాలు అందిస్తున్నామని తెలిపారు.
వికలాంగులకు సహాయ పరికరాలు అందజేయడం, సామూహిక ప్రదేశాలను వారికి అనుకూలంగా మార్చడం, దాడులు లేదా వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జూన్ 2న రాష్ట్రంలో 2 లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేస్తున్నామని, వికలాంగుల పెన్షన్ల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అందించే రుణాల్లో 5 శాతం వికలాంగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే రూ.2 లక్షల వివాహ ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. వికలాంగుల చట్టాలను బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల పెంపుపై కాలయాపన చేస్తోందని, ఇప్పటికే ఉన్న పెన్షన్లను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “ఫేస్ రికగ్నిషన్” పేరుతో అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లు రద్దు చేస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజంలో వికలాంగులపై కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, భువనగిరి జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. స్వామి, కోశాధికారి కొత్త లలిత, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు గౌడ్, DYFI జిల్లా కార్యదర్శి వెంకటేష్, PNM జిల్లా కార్యదర్శి ముత్యాలు, SFI జిల్లా కార్యదర్శి లౌడియా రాజు, NPRD రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రాజు, యశోద, నాగలక్ష్మి, కాశప్ప తదితరులు పాల్గొన్నారు.