విద్యార్థులే ఓటర్లు అయిన వేళ
చిట్యాల పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల ఎన్నికల సందడి
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల నాయకత్వ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పదవులకు బ్యాలెట్ పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల బరిలో నిలిచిన విద్యార్థి అభ్యర్థులు తమకు ఓటు వేసి గెలిపించాలని తోటి విద్యార్థులను కోరుతూ ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు విద్యార్థి ఓటర్లను ఆకట్టుకునేలా తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సుశీల పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో హెడ్ బాయ్‌గా ఎస్. రమేష్, హెడ్ గర్ల్‌గా ఎన్. ప్రసన్న ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులను ఉపాధ్యాయులు అభినందించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.