ఏలూరు జిల్లాలో 56 మొబైల్ టవర్ల ఏర్పాటు పూర్తి డిజిటల్ భారత్ నిధి పథకంతో 65 గ్రామాలకు 4జీ సేవలు
లోక్‌సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం
ఏలూరు, జూలై 22: డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) పథకం కింద గత ఐదేళ్లలో ఏలూరు జిల్లాలో 56 నాలుగో తరం (4జీ) మొబైల్ టవర్లను ఏర్పాటు చేసి 65 గ్రామాలు, ప్రాంతాలకు మొబైల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. లోక్‌సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్ర మంత్రి వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా మొబైల్ నెట్‌వర్క్ లేని గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు విస్తరించేందుకు డిజిటల్ భారత్ నిధి పథకం ద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 2,058 మొబైల్ టవర్లు ఏర్పాటు చేసి 4,047 గ్రామాలకు 4జీ సేవలు అందించారు.
ఏలూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 175 కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గుర్తు చేశారు. సిగ్నల్ సమస్యల కారణంగా ఈ-పాలన, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేకపోవడం, భూ కేటాయింపుల్లో జాప్యం, అటవీ అనుమతులు, మార్గ హక్కుల సమస్యల కారణంగా టవర్ల నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా పరిష్కరించి మిగిలిన టవర్ల ఏర్పాటును వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.