ఎల్నినో ప్రభావం: ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఎల్నినో ప్రభావం: ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, జూలై 22: ఎల్నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు.
బుధవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో పంట పొలాలను సందర్శించిన కలెక్టర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో సాగునీటి లభ్యత తగ్గే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. సాగునీటి పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలోని రామకృష్ణ ఎరువుల డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ యూరియా, డీఏపీ నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఎరువుల నిల్వ వివరాలను నోటీసు బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని, యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ తెలిపారు. జూలై నెలకు అవసరమైన 7,089 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 17,967 మెట్రిక్ టన్నులు, 3,506 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరానికి గాను 5,044 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు రైతులకు 6,197 మెట్రిక్ టన్నుల యూరియా, 1,712 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 174 ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి 11 దుకాణాల లైసెన్సులు రద్దు చేసినట్లు, నలుగురిపై ఆరు కేసులు నమోదు చేసి, 71 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. రూ.1.40 కోట్లకు పైగా విలువైన ఎరువుల నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, తహసీల్దార్ నజీముల్లాషా, ఎంపీడీఓ వాణి తదితరులు పాల్గొన్నారు.