గంపలగూడెంలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
గంపలగూడెంలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
గంపలగూడెం, జూలై 22: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ బుధవారం పర్యటించి, స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
కేంద్రంలో అందుబాటులో ఉన్న యూరియా, డీఏపీ తదితర ఎరువుల నిల్వలను పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలు, రైతులకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన సమాచారం స్పష్టంగా అందుబాటులో ఉంచడంతో పాటు పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్) యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని సమగ్ర వ్యవసాయ సేవలను పొందాలని సూచించారు. ప్రతి ఎరువుల దుకాణంలో ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎరువుల పంపిణీకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నంబర్ 91549 70454 లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో పలువురు అధికారులు పాల్గొన్నారు.